● ప్రలోభాల వెనుక పంపకాల గోల
● ఓటర్లకు డబ్బులు పంపిణీపై కూటమి నేతల్లో గుసగుసలు
● డబ్బు పంపిణీ బయటపడిందన్న సాకుతో మొత్తం నొక్కేశారని ప్రచారం
పిఠాపురం: పంచింది రూ.లక్షల్లో అయితే నొక్కేసింది రూ.కోట్లలో ఉండొచ్చని కూటమి నేతల్లో వినిపిస్తున్న గుసగుసలు పిఠాపురంలో హాట్ టాపిక్‌గా మారాయి. గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పిఠాపురంలో టీడీపీ నేతలు డబ్బు పంపిణీ చేసిన వైనం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. డబ్బు పంపిణీ పేరుతో పోలింగ్ రోజు వరకు కొందరు నేతలు తమ జేబులు నింపుకున్నారన్న చర్చ జరుగుతోంది. 30 మంది ఓటర్లకు ఒకరు చొప్పున కొందరు చోటా నాయకులను ఎంపిక చేసి ఆయా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేలా చేసినందుకు ఒక్కో చోటా నాయకుడికి రోజుకు రూ.1,000 చొప్పున ముట్టజెప్పిన నేతలు ఆ పేరుతో భారీగా వెనకేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గురువారం ఓటర్లకు డబ్బు పంచుతూ టీడీపీ నేత సోషల్ మీడియాకు చిక్కడంతో అసలు పంపిణీ చేసింది ఎంత? ఎంతమందికి ఇవ్వాలని డబ్బు తెచ్చారు? అనే విషయాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. మీకు ఖర్చులు ఇస్తాం రండి అంటూ దూర ప్రాంతాల నుంచి ఓటర్లను రప్పించిన కూటమి నేతలు తీరా వారు వచ్చి ఓటు వేశాకా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకేం తెలుసు అంటూ ఖర్చులు ఇవ్వకుండా తప్పించుకున్నట్టు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ఓటరు పోలింగ్ కేంద్రం వద్ద వాపోయినట్లు తెలిసింది. వారం రోజుల క్రితమే దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను గుర్తించమని వార్డు స్థాయి నేతలను అధినేతలు ఆదేశించారు. ఇదే అదనుగా కొందరు వార్డు స్థాయి నేతలు తమ జేబులు నింపుకున్నారని అంటున్నారు.
కావాలనే వీడియో బయట పెట్టారా?
కేవలం కొందరు నేతలు మాత్రమే డబ్బు పంపిణీ బాధ్యతలు తీసుకుని అరకొరగా పంపిణీ చేసి పెద్ద మొత్తంలో పక్కదోవ పట్టించారని కూటమి వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం, పార్టీ అభ్యర్థికి అనుమానం రాకుండా ఉండాలనే కావాలనే డబ్బులు పంచుతున్న వీడియోను బయట పడేలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. తక్కువ మందికి పంపిణీ చేసి ఎక్కువ మందికి ఇచ్చినట్టు చూపించడం ద్వారా ఎక్కువ మొత్తం కొట్టేయాలనే ఆలోచనలో భాగంగా కొందరికి పంపిణీ చేసి తాము నిజంగా పంపిణీ చేసినట్లు బయటకు తెలిసేలా చేసిన ఒక ప్రయోగంగా బయటపడిన వీడియో గురించి చెప్పుకుంటున్నారు. ఒక విధంగా టీడీపీ నేత డబ్బు పంపిణీ చేస్తూ దొరికి పోవడం సమాజంలో ఒక గుర్తింపు ఉన్న పట్టభద్రులను అవినీతి పరులుగా సమాజానికి తెలియజేసే విధంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహించాల్సిన ఎన్నికల అధికారులు ఇంత బహిరంగంగా డబ్బు పంపిణీ బయటపడినా ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అంటున్నారు రాజకీయ వేత్తలు.
Comments
Please login to add a commentAdd a comment