ఘనంగా కవిశేఖర ఉమర్ ఆలీషా జయంతి
కాకినాడ రూరల్: పిఠాపురంలోని విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 140వ జయంత్యుత్సవం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్‌క్లబ్ వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పీఠం కాకినాడ ఆశ్రమ శాఖ ఆధ్వర్యంలో పీఠం కన్వీనరు పేరూరి సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా విగ్రహానికి నవమ పీఠాథిపతి ఉమర్ ఆలీషా సద్గురువు సోదరులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షా ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ మహాకవిగా, శతావధానిగా, తత్త్వవేత్త, సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, పీఠాధిపతిగా డాక్టర్ ఉమర్ ఆలీషా సేవలందించారన్నారు. మాతృ భాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగులో అద్భుతంగా సాహిత్య సంపద సృష్టించారన్నారు. కవిశేఖర ఉమర్ ఆలీషా 1885 ఫిబ్రవరి 28న జన్మించారని, ఆయన జయంతి తమకు పండగ లాంటిదన్నారు. ప్రముఖ పేరడీ గాయకుడు బలరామకృష్ణ తన పాటలతో అలరించారు. ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ షా, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు, స్థానిక పీఠం కన్వీనర్ యల్లమాంబ, కాకినాడ లక్ష్మి, రెడ్డి సూర్య ప్రభావతి, వనుము మణి, బాదం లక్ష్మికుమారి, వీరభద్రరావు, రెహ్మన్ కవి శేఖర డాక్టరు ఉమర్ ఆలీషా గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment