చంద్రబాబు వంచన బయటపడింది
● రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేలా బడ్జెట్
● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల
రీజనల్ కో ఆర్డినేటర్ కన్నబాబు
కాకినాడ రూరల్: చంద్రబాబు ప్రజలను ఏ విధంగా వంచిస్తారో బడ్టెట్‌లో కేటాయింపులే సాక్ష్యం. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజలకు పనికి వచ్చే విధంగా గాని, వారికి మంచి చేయాలనే సంకల్పంతో గాని రూపొందించలేదని, ఉన్నది లేనట్టుగా ఏదో జరుగుతున్నట్టుగా రంగుల కలలా తయారు చేశారని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ఎంతసేపూ పొగడ్తలే తప్ప, ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలనే ఆలోచనతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మరో మంత్రిని పొగిడి స్వామిభక్తిని చాటుకున్నట్టుగా ఆర్థికమంత్రి కేశవ్ ప్రసంగం ఉంది. చంద్రబాబు సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకుంటానని చాలాసార్లు చెబుతారు, కానీ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేసే పద్ధతిలో బడ్జెట్‌లో కనిపించింది. ఒకపక్క రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి, సంక్షోభంలో కూరుకుపోతున్నారు. మిర్చి, టమాటా, వరి రైతులు ఇబ్బందులు పడుతుండడంతో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కేవలం రూ.300 కోట్లు కేటాయించడమనేది వారి చిత్తశుద్ధి, రైతులకు ఇచ్చిన ప్రాధాన్యం అర్థమవుతుంది. కల్లబొల్లి కబుర్లు చెప్పి బయట పడాలని చూశారు. తొలి బడ్జెట్ పేలవంగా ఉంది. ప్రభుత్వం ప్రజల సంక్షేమం విషయంలో చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కనిపించడం లేదు. కొన్ని హామీలకు అరకొరగా నిధులు కేటాయించి, కొన్నింటి ఊసే ఎత్తలేదంటే ఈ ఏడాది వాటి జోలికి వెళ్లడం లేదని అర్థమవుతోంది’ అన్నారు.
సంక్షేమ సారథిగా జగన్‌మోహన్‌రెడ్డి పది మెట్లు పైకి..
‘బడ్జెట్ చూస్తే జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ సారథిగా మరో పదిమెట్లు పైకి ఎక్కినట్టుగా కనిపిస్తోంది. చెప్పినవి చెప్పినట్టుగా ప్రతి బడ్జెట్‌లో నిధులు కేటాయించి లబ్ధిదారులు సంఖ్యతో సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించి కొత్త ఒరవడికి జగన్ శ్రీకారం చుడితే.. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేనట్టుగా అయ్యింది. మరోపక్క పెద్ద ఎత్తున గతంలో అప్పులు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు అప్పుల వివరాలు పొందుపరచకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తల్లికి వందనం, దీపం, పెట్టుబడి సాయం వంటి పథకాలకు కేటాయించిన నిధులు చూస్తే లబ్ధిదారుల సంఖ్యను దారుణంగా కుదించారని అర్థమవుతోంది.
జగన్‌ను దూషించడానికి... చంద్రబాబు, లోకేష్‌ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయడానికి చూపిన శ్రద్ధ బడ్జెట్ రూపొందించడంలో కనిపించలేదు. గత ప్రభుత్వం బాకీలు మేము తీర్చామని ఆర్థిక మంత్రి ప్రకటించారని, గత ప్రభుత్వం బకాయిలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత. 2019లో జగన్ అధికారంలో వచ్చిన తరువాత చంద్రబాబు పెట్టిన బకాయిలు తీర్చుకుంటూ వచ్చారు. ప్రభుత్వం అనేది కంటిన్యూయస్ ప్రొసెస్. బకాయిలు తీర్చామని చెబుతున్న మీరు ఎవరెవరికి బిల్లులు చెల్లించారో ప్రకటించగలరా. ఇప్పటికి చిన్నచిన్న పనులు చేసిన ఎంతోమంది బిల్లులు రాక నలిగిపోతున్నది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం.’అని కన్నబాబు ప్రశ్నించారు
Comments
Please login to add a commentAdd a comment