
యువతకు అండగా పోరుబాట
కాకినాడ రూరల్: నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం, వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం తదితర కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ యువతకు అండగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టనుంది. ‘యువత పోరు’ పేరిట ఈ ఆందోళనకు సంబంధించిన కార్యాచరణపై పార్టీ నేతలు శనివారం కాకినాడలోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసంలో శనివారం సమావేశమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్టినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో ఈ 12వ తేదీ ఉదయం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన అనంతరం, యువత పోరు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ కాకినాడ సిటీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకోవాలని నిర్ణయించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణం చెల్లించి, విద్యార్థుల్లో ఆందోళన తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. సమావేశం అనంతరం ఈ వివరాలను కన్నబాబు, దాడిశెట్టి రాజా మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12న యువత పోరు పేరిట పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించనున్నామని చెప్పారు. ఏరుదాటాక తెప్ప తగలేస్తున్న చందంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టనున్నామన్నారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత మెరుగుపరచి అమలు చేశారని, నేడు ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ ఇస్తాయో, ఇవ్వవో, పరీక్షలకు కూర్చోనిస్తారో లేదో తెలియని పరిస్థితి సృష్టించారని దుయ్యబట్టారు. విద్యార్థులపై కళాశాలలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని, ఈ విషయాలు టీడీపీ అనుకూల మీడియాలో ఎక్కడా రావని దుయ్యబట్టారు. ఒత్తిడి ఉంటే విద్యార్థులు ఏవిధంగా పరీక్షలు రాయగలుగుతారని వారు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని, లేకుంటే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని నిలదీశారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ వంటి వాటికీ అతీగతీ లేదన్నారు. గత సీఎం జగన్ రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు తీసుకురావడం చరిత్రాత్మకమన్నారు. వీటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా చెబుతోందని దుయ్యబట్టారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా పెద్ద ఎత్తున ఆస్పత్రులు వస్తాయని, తద్వారా ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చెప్పింది చేస్తారనేది ప్రజల నమ్మకమని, చంద్రబాబు చెప్పింది చేయరనే విషయాన్ని ఆయన పాలన చెబుతోందని కన్నబాబు, రాజా విమర్శించారు. సమావేశంలో కాకినాడ సిటీ, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వంగా గీత, దవులూరి దొరబాబు, తోట నరసింహం, ముద్రగడ గిరి బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ గుబ్బల తులసీరామ్, పార్టీ వివిధ విభాగాల ప్రతినిధులు, నాయకులు కురసాల సత్యనారాయణ, రావూరి వెంకటేశ్వరరావు, కొప్పన శివ, సుంకర విద్యాసాగర్, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, సర్పంచ్ రామదేవు చిన్నా, పెదపాటి అమ్మాజీ, మురళీరాజు, వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు.
ఫ 12న కాకినాడలో
వైఎస్సార్ సీపీ ఆందోళన
ఫ కన్నబాబు నివాసంలో
కో– ఆర్డినేటర్ల సమావేశం
ఫ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన కార్యాచరణ
Comments
Please login to add a commentAdd a comment