
రత్నగిరి.. భక్తజనసిరి
అన్నవరం: సత్యదేవుడిని శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి, పూజలు చేశారు. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు తమ బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి తరలివచ్చారు. వీరందరూ స్వామివారి వ్రతాలాచరించి, దర్శనాలు చేసుకున్నారు. దీంతో ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని 40 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 4 వేల మంది స్వీకరించారు. ఆలయంలో సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. సెలవు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment