
ఎన్.సూరవరం కార్యదర్శి సస్పెన్షన్
తుని రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, వసూలు చేసిన ఆస్తి పన్నులను సబ్ ట్రెజరీలో జమ చేయకపోవడంపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తుని మండలం ఎన్.సూరవరం పంచాయతీ గ్రేడ్–3 కార్యదర్శి కె.వెంకటలక్ష్మి సస్పెండ్ అయ్యారు. దీనిపై ఈ నెల ఏడో తేదీన కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు బుధవారం ఈఓపీఆర్‌డీ జి.మరిడియ్య తెలిపారు. టి.తిమ్మాపురం, తేటగుంట గ్రామాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ, ఇటీవల ఎన్.సూరవరానికి వెంకటలక్ష్మి బదిలీపై వచ్చారు. ఆ రెండు గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసేందుకు డిమాండ్ నోటీసులు ఇవ్వకపోవడం, వసూలు చేసిన మొత్తంలో కొంత సొమ్ము సబ్ ట్రెజరీకి జమ చేయలేనట్టు ఆమైపె ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో తుని ఎంపీడీఓ, పెద్దాపురం డీఎల్‌పీఓలు వేర్వేరుగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దాన్ని సమగ్రంగా పరిశీలించిన ఉన్నత అధికారులు కార్యదర్శి వెంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు.
హాకీ టోర్నీ విజేత ‘కాకినాడ’
ధర్మవరం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీ విజేతగా కాకినాడ జిల్లా జట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వైఎస్సార్ జట్టుపై 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్.. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
ధవళేశ్వరం: వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో మోటారు సైక్లిస్టు మృతి చెందాడు. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం యర్రంపాలేనికి చెందిన నేటి శ్రీను (50) ఈ నెల 4వ తేదీన తణుకు మండలం వేల్పూరులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి బుధవారం స్వగ్రామానికి మోటారు సైకిల్‌పై ప్రయాణమయ్యాడు. ఉదయం 10 గంటల సమయంలో ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రగాయాలైన శ్రీనును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు సీఐ టి.గణేష్ ఆధ్వర్యంలో ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్.సూరవరం కార్యదర్శి సస్పెన్షన్