
ఎక్కడో.. మన స్థానం!
జిల్లాలో పరీక్షలు రాసిన
విద్యార్థుల వివరాలు
ఫస్టియర్ జనరల్ 21,004
ఒకేషనల్ 1,656
సెకండియర్ జనరల్ 20,179
ఒకేషనల్ 1,692
మొత్తం 44,531
గత ఏడాది మన జిల్లా స్థానం 18
ఫ నేడు ఇంటర్ ఫలితాల విడుదల
ఫ తేలనున్న 44,531 మంది భవితవ్యం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. వార్షిక పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు, కళాశాలల యాజమాన్యాల ఉత్కంఠకు శనివారం తెర పడనుంది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను విజయవాడలోని కార్యాలయంలో మాధ్యమిక విద్యా శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ శనివారం విడుదల చేయనున్నారు. ఎటువంటి సాంకేతిక అవరోధాలూ లేకుంటే ముందుగా ప్రకటించిన సమయానికే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యాభ్యాసంలో విద్యార్థులు మరో మెట్టు ఎక్కడానికి తోడ్పడే ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గత విద్యా సంవత్సరం మాదిరిగానే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు మాధ్యమిక విద్యా మండలి కృషి చేసింది. మార్చి ఒకటో తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు 20వ తేదీతో ముగిశాయి. పరీక్షలు పూర్తి కాకుండానే మార్చి ఏడో తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఏప్రిల్ 4వ తేదీతో మూల్యాంకనాన్ని ముగించారు. 28 రోజుల్లో పూర్తి స్థాయిలో స్పాట్ వేల్యుయేషన్ ముగించి, వారం రోజుల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 12న ఫలితాలు విడుదల చేయగా ఈ ఏడాది ఒక రోజు ముందే విడుదల చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 44,531 మంది పరీక్షలు రాశారు. 2023 వరకూ ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలు విడుదల చేయగా, గత ఏడాది నుంచి కొత్త జిల్లాల ప్రకారం విడుదల చేస్తున్నారు. గత ఏడాది ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మన జిల్లా రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంతో సరిపెట్టుకుంది. అలాగే, ఫస్టియర్‌లో 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లా ఏ స్థానంలో నిలుస్తుందోనని అధికారులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంటర్ ఫలితాలు విద్యార్థుల మొబైల్ ఫోన్లకే నేరుగా విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియెట్ కమిషనర్ కృతికా శుక్లా వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను హెచ్‌టీటీపీఎస్://రిజల్ట్స్‌బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా కూడా పొందవచ్చు. అలాగే మన మిత్ర యాప్‌లో 95523 00009 నంబరుకు హాయ్ అని ఇంగ్లిషులో మెసేజ్ పంపించడం ద్వారా కూడా ఫలితాలను నేరుగా సెల్‌లో పొందే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది.