
ఘనంగా సీతారాముల చక్రస్నానం
అన్నవరం: రత్నగిరిపై నిర్వహిస్తున్న శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా పంపా జలాశయంలో సీతారాములకు శ్రీచక్రస్నాన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు వెంట రాగా పల్లకీపై నవ దంపతులు సీతారాములను పంపా తీరానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడి వేదికపై సీతారాములను ఒక సింహాసనం మీద, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అమ్మవారిని మరో సింహాసనం మీద వేంచేయించి, పూజలు చేశారు. అనంతరం సీతారాములకు, సుదర్శన చక్రానికి పండితులు అవభృథ స్నానం నిర్వహించారు. అనంతరం సీతారాముల విగ్రహాలను, సుదర్శన చక్రాన్ని పండితుల మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా పంపా జలాశయానికి తీసుకుని వెళ్లి, ఘనంగా శ్రీచక్రస్నానం నిర్వహించారు. అనంతరం సీతారాములను సింహాసనంపై వేంచేయించి, మరోసారి పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు, పరిచారకులు తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో సీతారాములకు సాయంత్రం 4 గంటలకు నాకబలి, దండియాడింపు కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు సీతారాముల విగ్రహాలతో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ నాట్యం చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి రామాలయంలో సీతారాములకు శ్రీపుష్పయాగం కార్యక్రమం నిర్వహించనున్నారు.
శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయం శనివారం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేసంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామి వారికి రూ.2,80,809 ఆదాయం సమకూరిందని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. మూడు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామని చెప్పారు.

ఘనంగా సీతారాముల చక్రస్నానం