
కేసులు బేషరతుగా ఉపసంహరించాలి
● ప్రజాస్వామ్యానికి సంకెళ్లు అన్యాయం
● కాకినాడలో జర్నలిస్టుల ధర్నా
● డీఆర్‌ఓకు వినతిపత్రం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పాత్రికేయులను భయభ్రాంతులకు గురి చేసే విధానాలకు ప్రభుత్వం తక్షణం స్వస్తి పలకాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. పత్రికలకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడం సమంజసం కాదన్నారు. ‘సాక్షి’ పత్రికపై కక్ష కట్టి సంపాదకులు ధనుంజయరెడ్డి సహా విలేకర్లపై అక్రమంగా నమోదు చేసిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ సిటీ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యాన కలెక్టరేట్ గేటు వద్ద ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, కెమెరామన్లు శనివారం మండుటెండలో నిరసన తెలిపారు. ప్రభుత్వం అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తే పాత్రికేయులంతా ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం, వియ్ వాంట్ జస్టిస్, కేసులు ఉపసంహరించుకోవాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. నల్ల రిబ్బన్లు ధరించి ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ గేటు నుంచి ప్లకార్డులతో డీఆర్‌ఓ కార్యాలయం వరకూ జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌ఓ వెంకట్రావుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కె.స్వాతిప్రసాద్ మాట్లాడుతూ, పత్రికలు ప్రచురించే వార్తలపై అభ్యంతరాలుంటే వాటిని సవరించాని కోరే హక్కు ఎవరికై నా ఉంటుందని అన్నారు. అలా కాదని, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం బేషరతుగా కేసులు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.నవీన్‌రాజు మాట్లాడుతూ, అక్రమ కేసులతో పాత్రికేయులు, పత్రికలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సహేతుకం కాదని అన్నారు. నిష్పక్షపాతంగా వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులతో వేధింపులకు దిగడం సరి కాదని, కేసులు ఉపసంహరించుకోవాలని జాప్ ప్రతినిధి కృష్ణంరాజు డిమాండ్ చేశారు. డాక్టర్ ఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇటువంటి కేసులతో భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. కాకినాడ సిటీ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ, పత్రికలు, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.
నిరసన కార్యక్రమంలో సాక్షి బ్యూరో చీఫ్ లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి టీవీ ప్రతినిధి బొక్కినాల రాజు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు నయీంఖాన్ దురానీ, అంజిబాబు, వీధి గోపి, మేకల వెంకట రమణ, దొరబాబు, సురేష్, సూర్యనారాయణ, దుర్గారావు, బండి రాజేష్, ముమ్మిడి వెంకట రమణ (చిన్నా), నందిని, బీసీఎన్ శివ, గోన సురేష్, ఆకెళ్ల శ్రీనివాస్, తోట చక్రధర్, రాజబాబు, తలాటం సత్యనారాయణ, బొత్స వెంకట్, దొమ్మేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కేసులు బేషరతుగా ఉపసంహరించాలి