
వైభవంగా వెంకన్న శ్రీపుష్పోత్సవం
వాడపల్లిలో ముగిసిన కల్యాణోత్సవాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని శ్రీపుష్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన కల్యాణమహోత్సవాలు ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీపుష్పోత్సవంతో ఘనంగా ముగిసాయి. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వైఖానస పండితులు ఖండవల్లి రాజేశ్వరవరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి రాత్రి శ్రీపుష్పోత్సవం నిర్వహించారు. వివిధ రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అద్దాల మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి వారిని జోల పాటలతో పవళింపజేశారు. పలువురికి దంపతి తాంబులాలు అందచేశారు. కాగా అందరి సహకారంతో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు డీసీ చక్రధరరావు తెలిపారు.
ర్యాలి జగన్మోహినీ కేశవస్వామికి..
కొత్తపేట: పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవ స్వామికి ఆదివారం నిర్వహించిన శ్రీపుష్పోత్సవంతో కల్యాణోత్సవాలు ముగిసాయి. ఈ సందర్భంగా ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. వేదపండితులు, అర్చకులు స్వామివారి మేలుకొలుపు, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను తిలకించారు.