రక్తదానంలో సెంచరీ..! | - | Sakshi
Sakshi News home page

రక్తదానంలో సెంచరీ..!

Published Wed, Jun 14 2023 1:00 AM | Last Updated on Wed, Jun 14 2023 11:35 AM

రక్తదానం చేస్తున్న వీటీ రాజ్‌కుమార్‌  - Sakshi

రక్తదానం చేస్తున్న వీటీ రాజ్‌కుమార్‌

సాక్షి, కామారెడ్డి : వస్త్ర వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సరే ఆపదలో ఉన్నవారికి రక్తం ఇవ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. ఒక సారి కాదు, రెండు సార్లు కాదు.. ఇప్పటికీ ఆయన 102 సార్లు రక్తదానం చేశాడు. ఎంతో మందికి రక్తం ఇచ్చి ప్రాణదాతగా నిలిచాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాంబే క్లాథ్‌ హౌజ్‌ షాపింగ్‌ మాల్‌ యజమాని వీటీ రాజ్‌కుమార్‌ నాలుగున్నర దశాబ్దాలుగా రక్తదానం చేస్తున్నాడు. ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు రక్తదానం చేయడం అలవాటుగా మారింది.

రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలిచిన వీటీ రాజ్‌కుమార్‌ను రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై అవార్డుతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా వీటీ రాజ్‌కుమార్‌ అందించిన సేవలపై ‘సాక్షి’ కథనం..

కామారెడ్డిలో లయన్స్‌ క్లబ్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో విపత్తులు సంభవించినా బాంబే క్లాథ్‌ హౌజ్‌ ద్వారా దుస్తులు, ఆహార పదార్థాలను పంపిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించి సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు దుస్తులు, దుప్పట్లు అందజేస్తారు. రోడ్డు మీద పండ్లు, కూర గాయలు అమ్ముకుని జీవనం సాగించే వారికి ఎండ, వానల నుంచి రక్షించుకునేందుకు గొడుగులు పంపిణీ చేయడం, వైద్య శిబిరాలతో పేదలకు మందులు ఇవ్వడం, అవసరమైన వారికి ఆపరేషన్లూ చే యిస్తారు. కామారెడ్డి ఆస్పత్రి సమీపంలో రూ. 5కు భోజనం కూడా పెడుతున్నారు. ఇలా నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు.

తండ్రి పేరిట బ్లడ్‌ బ్యాంక్‌..

వైద్యం కోసం కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, డెలివరీల కోసం ఇక్కడి ఆస్పత్రులకు వచ్చే వారు సమయానికి రక్తం దొరక్క ఇబ్బందులు పడడమే కాదు ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. బాంబే క్లాథ్‌ హౌజ్‌ ముందరే ప్రభుత్వ ఆస్పత్రి ఉండడం, ఆస్పత్రికి వచ్చిన వారు బ్లడ్‌ కోసం పడే ఇబ్బందులను చూసి చలించిపోయిన వీటీ రాజ్‌కుమార్‌ ఆయన సోదరుడు వీటీ లాల్‌ బ్లడ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడానికి ముందు కు వచ్చారు. తమ తండ్రి వీటీ ఠాకూర్‌ పేరుతో బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయడంతో పాటు క్యాంపులు నిర్వహిస్తూ రక్తం సేకరించి నిల్వ చేయడం, ఆదప లో ఉన్న వారిని ఆదుకుంటూ వస్తున్నారు.

నాలుగున్నర దశాబ్దాల కాలంలో వేలాది మందికి రక్తం అందించారు. కాగా రాష్ట్రంలో అత్యధిక పర్యాయాలు రక్తదానం చేసిన వారిని గుర్తించి రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న అవార్డులను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అత్యధిక పర్యాయాలు రక్తదానం చేసిన వారిలో రెండో వ్యక్తిగా వీటీ రాజ్‌కుమార్‌ను గవర్నర్‌ తమిళిసై అవార్డుతో సన్మానించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ ఎం రాజన్న రాజ్‌కుమార్‌ను అభినందించారు.

రక్తదానంతో ఎంతో సంతృప్తి కలుగుతుంది..

సమయానికి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నన్నెంతగానో కలచివేశాయి. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నా.అప్పటి నుంచి ఏటా రెండు, మూడు సార్లు తప్పకుండా రక్తదానం చేస్తూనే ఉన్నా. బ్లడ్‌ బ్యాంక్‌ కూడా ఏర్పాటు చేసి ఎంతో మందిని ఆదుకున్నాం. ఎన్ని డబ్బులు సంపాదించినా మనిషికి తృప్తి ఉండకపోవచ్చు. కానీ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడినపుడు ఎంతో తృప్తి కలుగుతుంది. ఇన్ని సార్లు రక్తదానం చేస్తానని కలలో కూడా అనుకోలేదు. మొదట్లో 20 సార్లు చేయాలనుకున్న. తరువాత టార్గెట్‌ 50 కి పెట్టుకున్నా. ఆ తరువాత వంద సార్లు అనుకున్నా. ఇప్పటికీ 102 సార్లు రక్తదానం చేశాను. శక్తి ఉన్నంత కాలం చేస్తూనే ఉంటా. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement