తీసుకున్న అప్పు చెల్లించాలన్నందుకే హత్య
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్‌కు చెందిన ఆశావర్కర్ కొండ లక్ష్మి(45) జనవరి 21న అదృశ్యమై, చివరకు హత్యకు గురైన విషయం విదితమే. ఈఘటనలో నిందితుడిని బుధవారం పోలీసుల అరెస్టు చేశారు. ఈక్రమంలో హత్యకు సంబంధించి ‘సాక్షి’ సేకరించిన సమాచారంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌కు చెందిన కుంచపు వెంకటేష్ కూలీ పని చేయడానికి గతంలో నాగేంద్రనగర్‌కు వచ్చాడు. ఈక్రమంలో ఒంటరిగా ఉంటున్న లక్ష్మితో పరిచయం పెంచుకుని ఆమె ఇంటిలో కూలీ పని చేసేవాడు. ఆమెను నమ్మించి కొంత నగదును చేబదులుగా తీసుకున్నాడు. ఆమె ఇచ్చిన సొమ్మును తిరిగివ్వాలని అడగడంతో కోపం పెంచుకున్న వెంకటేష్ ఫోన్ చేసి పొన్కల్‌కు వస్తే డబ్బులు ఇస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన లక్ష్మి పొన్కల్ వెళ్లగా మాయమాటలు చెప్పి, దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అనంతరం ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును తీసుకున్నాడు. హత్య చేసి మృతదేహాన్ని ఎవరికి కనపడకుండా చెట్టు చాటున ఉంచి గ్రామానికి చేరుకున్నాడు. ఏమీ ఎరుగనట్లు నిజామాబాద్, నిర్మల్ మార్కెట్‌లలో ఉల్లిగడ్డలు అమ్ముతున్నాడు. తనకు ఆరోగ్యం బాగలేదని ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు పత్రాలను సైతం సృష్టించాడు. కానీ మృతురాలు లక్ష్మి, నిందితుడు వెంకటేష్ ఫోన్‌లు ఒకే సమయంలో ఒకేచోట స్విచ్‌ఆఫ్ కావడంతో వెంకటేష్ కుట్ర కోణంపై పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమెను ఇంటి వద్ద నుంచి వచ్చిన రోజునే హత్య చేసి, శవంను అటవీ ప్రాంతంలో దాచి ఉంచినట్లు నిందితుడు అంగీకరించాడు. మృతదేహాన్ని దాచిన ప్రాంతానికి పోలీసులను తీసుకువెళ్లి చూయించాడు. అందరితో కలుపుగోలుగా ఉండే లక్ష్మి హత్యకు గురికావడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నాగేంద్రనగర్ ఆశావర్కర్ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
నిందితుడి పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment