గాంధారి: మండలంలోని పలు గ్రామాల్లో శనివా రం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురసింది. తిప్పారం, తిప్పారం తండా, గొల్లాడి తండా, సోమారం తండా తదితర తండాల్లో వడగళ్లు పడ్డాయి. దీంతో కోతకొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. గొల్లాడి తండా శివారులో వందల ఎకరాల జొన్న పంటకు నష్టం జరిగింది.
పంటల పరిశీలన
సదాశివనగర్: మండల కేంద్రంతో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డి, కుప్రియాల్, మర్కల్, తిర్మన్‌పల్లి, ధర్మారావ్‌పేట్‌లలో శుక్రవారం కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ విస్తీర్ణాధికారులు పరిశీలించారు. మండలంలో 42 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఏవో ప్రజాపతి తెలిపారు.
భిక్కనూరు: అంతంపల్లి శివారులో శుక్రవారం కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఆయన వెంట ఏడీఏ అపర్ణ, ఏఈవో లిఖిత్‌రెడ్డి, రైతులు ఉన్నారు. లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన సుభాన్‌రెడ్డికి చెందిన వందకుపైగా బొప్పాయి చెట్లు గాలిదుమారంతో నేలకూలాయి.
రాజంపేట: రాజంపేట, ఆరేపల్లి, బసవన్నపల్లి, అరగొండ గ్రామాలలో వర్షంతో దెబ్బతిన్న మక్క, వరి పంటలను వ్యవసాయాధికారులు పరిశీలించారు. 26 ఎకరాలలో మొక్కజొన్న పంట నేలవాలిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రుతి, ఏఈవోలు శిల్ప, సవిత, బాలకిషన్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో శుక్రవారం రాత్రి 9.3 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని రెవెన్యూ అధికారులు తెలిపారు.