
‘ మార్కెట్ విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించాలి’
కామారెడ్డి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులందరికి 010 పద్దు కింద రెగ్యులర్ ప్రాతిపదికన పెన్షన్లు చెల్లించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సలహాదారుడు జి.లచ్చయ్య, మార్కెట్ కమిటీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బన్సీలాల్ అన్నారు. గురువారం స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.హన్మంత్‌రెడ్డి అధ్యక్షతన మార్కెట్ కమిటీ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశంలో మార్కెట్ విశ్రాంత ఉద్యోగుల వివిధ సమస్యలపై చర్చించారు. హెల్త్‌కార్డుల జారీ, బకాయిల విడుదల, లైఫ్ సర్టిఫికెట్ల వ్యవస్థను మీసేవలో అప్‌డేట్ చేయడం, నిలిచిపోయిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం, పీఆర్‌సీ, డీఏ సమస్యలపై తీర్మానించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.విజయరామరాజు, కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శంకరయ్య, ప్రతినిధులు రవీందర్, సత్యనారాయణ, కే.వేణుగోపాల్, ఉమ్మడి జిల్లాలోని దాదాపు 40 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.