రుద్రూర్: మండలంలోని లింగంపల్లి శివారులో ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. స్థానిక రైతులు ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతురాలు కోటగిరి మండలం ఎత్తోండా గ్రామానికి చెందిన దేగావత్ లక్ష్మీబాయి (62)గా గుర్తించారు. ఈనెల 26 నుంచి లక్ష్మీబాయి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం లేకపోవడం, గత నాలుగు రోజులుగా ఆహారం లేనందున ఆరోగ్యం క్షిణించి మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు మృతురాలి భర్త లింబ్యా నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సాయన్న తెలిపారు.