
గౌరారం కలాన్‌లో కలకలం
గాంధారి: గౌరారం కలాన్‌లో మంగళవారం కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు, అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గౌరారం కలాన్‌లో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు మధ్యాహ్నం కల్లు తాగారు. ఆ కల్లు తాగిన కొందరు సాయంత్రం నుంచి నాలుక మొద్దుబారడంతోపాటు మెడనొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలపగా.. ఆర్‌ఐ ప్రదీప్, ఎస్సై ఆంజనేయులు, వైద్యారోగ్య, ఎకై ్సజ్ శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితి తెలుసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం 12 మంది బాధితులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కల్లు తాగిన పలువురికి అస్వస్థత
బాన్సువాడ ఆస్పత్రికి తరలింపు

గౌరారం కలాన్‌లో కలకలం