
చెరువులో పడి ఒకరి మృతి
ఇందల్వాయి: మండలంలోని గండి తండాలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గండితండాకు చెందిన విస్లావత్ నరేందర్ (43) సోమవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న బర్రెలకు నీరు పెట్టడానికి ఇంటి నుంచి వెళ్లాడు. ఈక్రమంలో పొలం పక్కన ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈమేరకు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బావిలో పడి వృద్ధుడు..
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి శివారులో ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. లింగాపూర్ గ్రామానికి చెందిన చెట్కూరి ఎల్లయ్య (85) కొద్ది రోజులుగా వృద్ధాప్య కారణాలతో మతిస్థిమితం కోల్పోయాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేడు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల గాలించిన ఆచూకీ దొరకలేదు. దేవునిపల్లి శివారులోని బండారి రాజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఎల్లయ్య మృతదేహం మంగళవారం తేలింది. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి భార్య మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి..
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయారెడ్డి మంగళవారం తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మృతుడు సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటాడన్నారు. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ దుర్గాప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే పోలీస్ ఫోన్ నంబర్ 8712652591కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.
చికిత్స పొందుతూ ఒకరు..
రెంజల్(బోధన్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై చంద్రమోహన్ మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన మద్దెల మదారి(41)అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి అత్తగారి ఊరైన రెంజల్ మండలంలోని నీలా గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో తాడ్‌బిలోలి గ్రామం వద్ద వడ్ల బస్తాలను ఢీకొనడంతో కిందపడి గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
బిచ్కుంద(జుక్కల్): వాహదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. బిచ్కుంద అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. తల్లింద్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు.

చెరువులో పడి ఒకరి మృతి