పార్టీయే బలం.. ప్రజలే బలగం | - | Sakshi
Sakshi News home page

పార్టీయే బలం.. ప్రజలే బలగం

Published Wed, Aug 23 2023 1:34 AM | Last Updated on Wed, Aug 23 2023 11:55 AM

- - Sakshi

పార్టీ మా బలం.. నియోజకవర్గ ప్రజలే బలగం అంటున్నారు ఉమ్మడి జిలా ఎమ్మెల్యేలు.. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు. సీఎం కేసీఆర్‌ మమ్మల్ని అభ్యర్థులుగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఇంతవరకు ఎంతో అభివృద్ధి చేశామని.. మరిన్ని పనులు చేసేందుకు ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీ కార్యకర్తలు.. ప్రజల సహకారంతో విజయబావుటా ఎగురవేస్తామన్నారు. అందరితో కలిసికట్టుగా పనిచేస్తూ తిరుగులేని గులాబీ సైన్యంగా ముందుకు సాగుతామని.. వచ్చేది తమదే సర్‌‘కారు’ అని పేర్కొన్నారు. ఇంకా వారేమన్నారో వారి మాటల్లోనే...

ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా
సిరిసిల్ల: సీఎం కేసీఆర్‌ నన్ను సిరిసిల్ల అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తాం. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గెలుస్తా. 2009 నుంచి సిరిసిల్ల ప్రజలు నన్ను నాలుగు సార్లు గెలిపించారు. వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. నియోజకవర్గ ప్రజల దీవెనలతో భారీ మెజార్టీతో గెలుస్తా.
– కె.తారక రామారావు, 

అభివృద్ధే ధ్యేయం
వేములవాడ: రాజన్న గుడి, వేములవాడ మరింత అభివృద్ధి చెందాలి్సన అవసరం ఉంది. ఇప్పటి వరకు పనిచేసిన రమేశ్‌బాబు నాయకత్వంలో భారీ మెజార్టీతో గెలుస్తాను. బీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు లేదు. మేమంతా ఒకే కుటుంబం. 
– చల్మెడ లక్ష్మీనరసింహారావు

మేనిఫెస్టోలో లేని పనులు చేశా..
కరీంనగర్‌: కరీంనగర్‌ను పదేళ్లల్లో వేలకోట్లతో అభివృద్ధి చేశాను. సీఎం కేసీఆర్‌కు కరీంనగర్‌పై ప్రత్యేక అభిమానంతో నిధులు కేటాయిస్తున్నారు. రూ.180 కోట్లతో తీగలవంతెన, రూ.410 కోట్లతో రివర్‌ఫ్రంట్‌ పనులు సాగుతున్నాయి. ఐటీటవర్, మెడికల్‌ కాలేజీ తదితరాలు పూర్తయ్యాయి. మేనిఫెస్టోలో లేని పనులు చేసి చూపించా. నాలుగోసారి విజయ బావుటా ఎగురవేస్తా..
 –గంగుల కమలాకర్, మంత్రి

ప్రజారుణం తీర్చుకుంటా
మానకొండూరు: మూడోసారి భారీ మెజార్టీతో గెలిచి ప్రజలరుణం తీర్చుకుంటా. సీఎం కేసీఆర్‌ నాపై నమ్మకంతో రెండుసార్లు మానకొండూరు ఎమ్మెల్యేగా టికెట్‌ ఇచ్చారు. అందరి సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేశాను. టిక్కెట్‌ ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. – రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే

కేసీఆరే  దైవం 
చొప్పదండి: కేసీఆర్‌  దైవసమానులు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. కార్యకర్తలే నా బలం, బలగం. 
గత ఎన్నికల్లో 42 వేల మెజారిటీతో గెలిపించారు. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేశా..రూ. 150 కోట్లతో కొండగట్టు అభివృద్ధి జరుగుతోంది. 
– సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే

‘హ్యాట్రిక్‌’ సాధిస్తా..
హుస్నాబాద్‌ ప్రజలు రెండుసార్లు ఆశీర్వదించారు. గడిచిన పదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశా. సీఎం కేసీఆర్‌ మరోసారి టికెట్‌ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రజలు ఎంతో సహకరించారు. అదేస్ఫూర్తితో హ్యాట్రిక్‌ విజయం సాధిస్తాను.
– వొడితెల సతీశ్‌కుమార్,ఎమ్మెల్యే

అన్ని రంగాల్లో అగ్రస్థానం
గోదావరిఖని: రామగుండాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం. గడిచిన నాలుగున్నరేళ్లలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కృషిచేశా. గోదావరిఖనిలో సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం, సీనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు, విలీన గ్రామాలకు విముక్తి కల్పించాను. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయను.      –కోరుకంటి చందర్,ఎమ్మెల్యే

సంక్షేమం.. సామాజిక సేవ
మంథని: మంథనిని 40ఏళ్లు పాలించిన దుద్దిళ్ల కుటుంబం పేదవాడికి చెంచడు నీళ్లు పోయలేదు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారికి చేరవేస్తున్నా. పేద కుటుంబంలో పుట్టిన తనపై నియోజకవర్గ ప్రజల అభిమానం, ఆశీస్సులు ఉన్నాయి.  మరోసారి విజయం సాధిస్తా.          
– పుట్ట మధు

సమస్యలు పరిష్కరిస్తా..
జగిత్యాల: అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తా. ఇప్పటికే జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ, మున్సిపాలిటీ సుందరీకరణ, రోడ్డు వెడల్పు పనులకు కృషి చేశాను. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాను.
– సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే

నాన్నే స్ఫూర్తి.. 
కోరుట్ల: నాలుగుసార్లు ఎమ్మెల్యేగా కోరుట్ల అభివృద్ధికి కృషిచేసిన నాన్న విద్యాసాగర్‌ రావు స్ఫూర్తి. యువకుడిగా, వైద్యుడిగా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రణాళికతో ముందుకెళ్తా. ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తా. నాన్న చేసిన అభివృద్ధి పనులు నా గెలుపునకు దోహదపడతాయి.
– డాక్టర్‌ సంజయ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement