సాక్షి, కరీంనగర్: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధనవమి వరకు తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులు జరుపుకుని పదోరోజు విజయదశమిని ఘనంగా నిర్వహించుకుంటారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ ఇది. చెడుపై మంచి విజయానికి సూచికగా నిర్వహించుకునే వేడుకే విజయదశమి. దసరా రోజున చేపట్టిన ప్రతీపనిలో విజయం లభిస్తుందని నమ్మకం. అందుకే శక్తి స్వరూపం ఆశీస్సులతో ప్రతిపని చేస్తుంటారు.
దసరా అంటే పది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది. రాముడు రావణుడిపై గెలిచిన రోజుగానే గాకుండా పాండవులు వనవాసం వీడుతూ.. జమ్మిచెట్టుపై ఉన్న తమ ఆయుధాలు తిరిగితీసిన రోజు అని కూడా చర్రిత చెబుతోంది. అందుకే దసరా రోజు రావణవధ, జమ్మి ఆకు పూజ చేస్తుంటారు. దుర్గాదేవి మహిషాసురడనే రాక్షసునితో నవరాత్రులు యుద్ధం చేసి విజయం సాధించిన రోజును విజయదశమిగా కూడా చెబుతుంటారు.
'పాల పిట్టల దర్శనం..'
దసరా రోజు సాయంత్రం పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాలపిట్టను చూస్తే పాపాలు, కర్రెపిట్టను చూసే కష్టాలు, గరత్మంతుడు అంటే గద్దను చూసే గండాలు తొలుగుతాయని ప్రజల నమ్మకం.
శమీ పూజ విశేషం..
దసరా రోజున శమీ పూజ ప్రత్యేకం. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున పూజలు చేసిన జమ్మిచెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, నగదుపెట్టెలో ఉంచుతారు. దీంతో ధనవృద్ధి జరుగుతుందని ప్రతీతి. శ్రీరాముడి వనవాస సమయంలో కుటీరం జమ్మిచెట్టు చెక్కలతో నిర్మించారని చెబుతారు. శమీ అంటే పాపాల్ని, శత్రువులను నశింపచేసేదిగా, అందుకే జమ్మి చెట్టుకు అంత ప్రాముఖ్యం.
ఆయుధ పూజ
మహిషాసురుడిని వధించడానికి దుర్గదేవి అష్టభుజాలతో అవతరించింది. దేవతలు తమ ఆయుధాలను అందించడంతో ఆదిశక్తి మహావిరాట్ రూపాన్ని సంతరించుకుంది. హిమవంతుడు ఇచ్చిన సింహాన్ని అధిరోహించి మహిషాసురుడిని వధించి వి జయవిలాసిగా మూర్తిమత్వాన్ని చాటుకుంది. అందువల్లే పూర్వం రాజులు ఆయుధాలను పూజించేవారు. ఆ ఆచారంతోనే దసరా రోజు యంత్రం, వా హన, పనిముట్లకు పూజలు చేయడం ఆనవాయితీ.
బంగారం ఇచ్చి ఆశీర్వాదం!
పెద్ద, చిన్న తేడా లేకుండా అందరూ కలిసి జమ్మిచెట్టు ఆకులను కుంకుమ కలిపిన బియ్యంలో కలుపుతారు. పూజ చేసిన జమ్మి, ఆకులు, బియ్యాన్ని ప్రతి ఒక్కరు తీసుకవెళ్తారు. దీనిని బంగారం అని పిలుస్తారు. ఈ బంగారం తీసుకెళ్లి తల్లిదండ్రులకు, పెద్దలకు చేతిలో పెట్టి ఆశీర్వాదం పొందడం అనవాయితీ. ఒకరికి ఒకరు ఇచ్చుకుని అలయ్‌బలయ్ చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment