'కర్రుకాల్చి వాతపెట్టున్రి' : కేసీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

'కర్రుకాల్చి వాతపెట్టున్రి' : కేసీఆర్‌

Published Sat, Nov 18 2023 1:36 AM | Last Updated on Sat, Nov 18 2023 8:53 AM

- - Sakshi

ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న కేసీఆర్‌, గద అందిస్తున్న సునీల్‌రావు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. పదేళ్లలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో సీఎం ప్రసంగం బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

ఓ వైపు జిల్లా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో, పదునైన మాటలతో ధ్వజమెత్తారు. 60 ఏళ్లు పరిపాలించిన ప్రతిపక్షాలు చేసిందేమీ లేదని, తాము పదేళ్లల్లో చేపట్టిన అభివృద్ధి కళ్లముందు పరుగులు పెడుతోందని అన్నారు. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, అలాంటి పార్టీని జిల్లా ప్రజలు 2001లో జరిగిన సింహగర్జన సభ నుంచి అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు.

రాయేదో.. రత్నమేదో ఆలోచించి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి గంగుల కమలాకర్‌ మొండి మనిషి అని ఆయన హయాంలో తీగలవంతెన, మానేరు రివర్‌ ఫ్రంట్‌, స్మార్ట్‌సిటీ పనులతో కరీంనగర్‌ సుందరీకరణ, కూడళ్ల అభివృద్ధి పరుగులు పెడుతోందని కితాబిచ్చారు. హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, చొప్పదండి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకె రవిశంకర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

34 నిమిషాలు ప్రసంగం..
బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో 34 నిమిషాలు ప్రసంగించారు. హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి సభాప్రాంగణానికి 1.38 నిమిషాలకు చేరుకున్నారు. తెలంగాణ ప్రగతి రథంలో మంత్రి గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌, మేయర్‌ వై.సునీల్‌రావు తదితరనేతలతో కలిసి 1.50నిమిషాలకు వేదికపైకి చేరుకున్నారు. మొదటగా కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

సీఎం కేసీఆర్‌ సరిగ్గా 2.02 నిమిషాల నుంచి 2.36 నిమిషాల వరకు మాట్లాడారు. 2001లో సింహగర్జన సభను ఇదే వేదికగా నిర్వహించామని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విజయాలు సాధించామని, 50 ఏళ్ల కాంగ్రెస్‌ దరిద్రపు పాలనకు పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు బేరీజు వేసుకుని బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్సీ మధుసూధనచారి, కార్పొరేషన్‌ చైర్మన్లు సర్దార్‌ రవీందర్‌సింగ్‌, కుర్మాచలం అనిల్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా!
ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కేసీఆర్‌ కాళ్లు పట్టుకోనైనా హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా. ఉప్పల్‌, చల్లూరు, వావిలాల మండలాల ఏర్పాటుకు కృషి చేస్తా. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు వెన్నుపోటు పొడిచి గజ్వేల్‌లో పోటీ చేస్తుండు. 15 ఏళ్లుగా ప్రజాసేవలోనే ఉన్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి . అభివృద్ధి చేసి చూపిస్తా. – పాడి కౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

కుక్కలు చింపిన విస్తరి అవుతుంది..
తెలంగాణ తెచ్చాం. 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం. గోదావరి జలాలతో కోటి ఎకరాలకు సాగునీరు అందించి చూపిస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. వందేళ్ల వరకు ప్రగతి పరుగులు పెట్టే విధంగా ప్రణాళికలున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను నమ్మితే తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌కు అండగా గులాబీ జెండా ఉంది. మంత్రి గంగులను భారీ మెజార్టీతో గెలిపించాలి. – బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

డాడీకి ఒక్క చాన్స్‌ ఇవ్వండి..
హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని హైదరాబాద్‌లా అభివృద్ధి చేయాలన్నదే మా డాడీ కళ. మీ అందరికీ దండంపెట్టి కోరుతున్నా. డాడీకి ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. డాడీ వెంట పడి హుజూరాబాద్‌ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు నిధులు తెచ్చేలా చేస్తా. – శ్రీనిక, కౌశిక్‌రెడ్డి కూతురు

కొంగుపట్టి కోరుతున్నా!
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 15 ఏళ్ల నుంచి ప్రజా సేవలోనే ఉన్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకు చేరవేస్తున్నాం.కొంగు పట్టి కోరుతున్నా కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన వెంటే నేను ఉంటా. – శాలిని, పాడి కౌశిక్‌రెడ్డి భార్
ఇవి చదవండి: 'నా తమ్ముడు జాన్సన్‌నాయక్‌ను' గెలిపిస్తే.. ఖానాపూర్‌ దత్తత తీసుకుంటా : కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement