కరీంనగర్: రేషన్‌కార్డుల జారీ ఎటూతేలకపోవడం కోడళ్లకు శాపంగా మారింది. ఇంటిపేరు మారినా రేషన్‌కార్డులో పేరు చేరకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలమంది నిరీక్షిస్తుండగా అధికార యంత్రాంగం సమాధానమివ్వలేని పరిస్థితి. గత అయిదేళ్లుగా దరఖాస్తులు కుప్ప ల్లా పేరుకుపోతుండగా కార్డుల జారీ ప్రశ్నార్థకం. ఇక పేర్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుండగా కొత్తకార్డుల జారీలో మాత్రం అలసత్వమే. కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని యంత్రాంగం చెబుతుండగా నిరీక్షణ ఇంకెన్నాళ్లన్న అసహనం వ్యక్తమవుతోంది.
‘నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన కత్తురోజు రమేశ్‌కు ఏడాది క్రితం వివాహమైంది. హుజూరాబాద్ నుంచి అఖిలను పెళ్లి చేసుకోగా ఆమెపేరును తల్లిగారింట తొలగించారు. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇది ఒక అఖిల పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్న కోడళ్లది.'
దరఖాస్తు చేసి ఏళ్లు.. మంజూరుకు ఎన్నేళ్లు
కొత్తకార్డుకు దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తుండగా స్పష్టమైన ప్రకటన లేదని వాపోతున్నారు. తనకు అయిదేళ్ల క్రితం వివాహమైందని, పిల్లలు పుట్టారని అయినా కార్డు మంజూరు కాలేదని చొప్పదండికి చెందిన రాజు వివరించారు. జిల్లాలో 512 రేషన్‌దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా 2.70లక్షల కార్డుదారులున్నారు. పెళ్లికాగానే తమ పేరును తొలగించాలని కొందరు యువతులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు.
వారి పేరు మీద ఉన్న యూనిట్‌ను అధికారులు తొలగిస్తున్నారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చే ఆప్షన్ లేకపోవడంతో కొందరు తొలగింపునకు ఒప్పుకోవడం లేదు. సదరు కార్డులు అలాగే కొనసాగుతుండగా పలు గ్రామాల్లో పేర్లు తొలగించాలని తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేసి తొలగిస్తున్నారు. ఈ మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా అత్తింటి కార్డులో ఒక్కపేరు చేర్చలేదని తెలుస్తోంది.
ఒక్కో కార్డుకు రూ.25 వసూలు
రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్త కార్డులు ముద్రించగా జిల్లాల విభజనతో సదరు కార్డులను మూలనపడేశారు. దీంతో డీలర్లే కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసిస్తున్నారు. ఒక్కోకార్డుకు రూ.25వరకు వసూలు చేస్తున్నారు. కొత్తకార్డులు, పేర్లు చేర్పించేందుకు మీసేవ కేంద్రాల్లో వేలల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.
అధికారులు విచారణచేసి అర్హులకు అనుమతిచ్చి కమిషనరేట్ లాగిన్‌కు పంపించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడక మూడేళ్ల నుంచి ముందుకు సాగడం లేదు. అయితే కొత్తకార్డుల జారీపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవని, కోడళ్లు తమ పేరును అత్తారింటి కార్డులో చేర్చేందుకు మీసేవలో నమోదు చేసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment