యువకుడి ఆత్మహత్య
ఎలిగేడు: ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన యువకుడు యాదగిరి చందు(27) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సనత్‌కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాదగిరి రవి– లక్ష్మీ దంపతుల కుమారుడు చందు ఎంబీఏ పూర్తి చేశాడు. రెండేళ్లుగా ఏ పనిచేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు ‘చదువుకుని ఖాళీగా ఉంటున్నావు. ఎలాంటి ఉద్యోగం చేయకుండా పెళ్లి ఎలా చేసుకుంటావని’ నిరాకరించారు. మనస్తాపానికి గురైన చందు బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చందు తండ్రి రవి ఫిర్యాదుతో జూలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
తండ్రి మందలించాడని కొడుకు..
మెట్‌పల్లి: తండ్రి మందలించాడని పట్టణ శివారులోని అర్బన్ హౌసింగ్ కాలనీకి చెందిన ఇమ్రాన్ (17) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. కాలనీకి చెందిన మజార్ పండ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని కుమారుడు ఇమ్రాన్ చదువుకోకుండా ఖాళీగా తిరుగుతుండడంతో మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఇమ్రాన్ కాలనీశివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
మాజీ జెడ్పీటీసీ..
వీణవంక: మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పీటీసీ ఆనంద రాజమల్లయ్య (75)ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నట్లు వివరించారు. మృతికి గల కారణాలు తెలియరలేదు. టీడీపీ తరఫున గెలుపొందిన ఈయన 1995–2000 సంవత్సరం వీణవంక జెడ్పీటీసీగా పనిచేశారు. దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందాడు. మృతిడికి భార్య లక్ష్మిబాయి, కుమారుడు, కూతురు ఉన్నారు.
భార్యాపిల్లల మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
పెగడపల్లి: భార్యాపిల్లల మృతికి కారణమైన మండలంలోని మద్దుపల్లి గ్రామానికి చెందిన కంబాల తిరుపతిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. ఈనెల 13న తిరుపతి భార్య హారిక, పిల్లలు మయాంతలక్ష్మి, క్రిష్ణాంత్ అత్యహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో హారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు తిరుపతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు ఆమెను వివాహం చేసుకుంటానని తరచూ హారికను వేధించడంతోనే హారిక తన పిల్లలతో ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు తిరుపతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.
తొలితరం బీఆర్‌ఎస్ నేత మృతి
సిరిసిల్లటౌన్: బీఆర్‌ఎస్ పార్టీ తొలితరం నేత కాసర్ల మల్లేశం(67) బుధవారం మృతిచెందారు. కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పనిచేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మల్లేశం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డారు. బుధవారం సిరిసిల్లలోని ఆస్పత్రిలో మృతిచెందారు. ఆయనకు భార్య మల్లవ్వ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
యువకుడి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment