చదువు వీడి చోరీల బాటలో..
మెట్‌పల్లి: తల్లిదండ్రులు చదువుకోవాలని మందలించడం అతనికి నచ్చలేదు. ఇంట్లో నుంచి పారిపోయి దొంగగా మారాడు. ఇప్పటివరకు అనేక చోరీలు చేసి.. పలుమార్లు జైలు పాలయ్యాడు. అయినా తన వైఖరి మాత్రం మారలేదు. మళ్లీమళ్లీ అదే దారిలో పయనిస్తున్న అతడిని పోలీసులు పట్టుకుని రూ.11లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ నిరంజన్‌రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ (28) ఆరో తరగతి చదివేటప్పుడు పాఠశాలకు సరిగ్గా వెళ్లలేదు. దీంతో అతని తండ్రి కొట్టడంతో హైదరాబాద్ పారిపోయాడు. అక్కడ పలుచోట్ల హోటళ్లలో పనిచేసిన సమయంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు లక్ష్మణ్‌ను అక్కడకు తీసుకెళ్లి దొంగతనాలు చేయించాడు. తర్వాత కొంతకాలానికి తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడా చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఒంటరిగా బస్సుల్లో గ్రామాలకు వెళ్లి తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ జల్సా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలుశిక్ష అనుభవించాడు. గత డిసెంబర్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన అతడు.. మల్లాపూర్ మండలం సిర్‌పూర్, ముత్యంపేట, మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేటలోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. మెట్‌పల్లిలో ఓ బైక్‌ను అపహరించాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రాములు పర్యవేక్షణలో సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై రాజుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ వద్ద తనిఖీలు చేస్తుండగా.. అక్కడికి బైక్‌పై వచ్చిన లక్ష్మణ్‌ను పట్టుకొని అరెస్ట్ చేశారు. అతని నుంచి 103 గ్రాముల బంగారు, 125 గ్రాముల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అతడు 40 దొంగతనాలకు పాల్పడ్డాడని, 12కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడని సీఐ తెలిపారు. గతంలో జగిత్యాల, కరీంనగర్, మహబూబ్‌నగర్ పోలీసుల కస్టడీ నుంచి పారిపోయిన అతడిని చాకచక్యంగా పట్టుకున్నామని వెల్లడించారు. సమావేశంలో ఎస్‌ఐ రాజు, ఇతర సిబ్బంది ఉన్నారు.
దొంగతనాల మార్గాన్ని ఎంచుకున్న యువకుడు
ఇప్పటి వరకు 40 కేసులు, పలుమార్లు జైలుపాలు
మరోసారి పట్టుకున్న మెట్‌పల్లి పోలీసులు
రూ.11 లక్షల సొత్తు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment