జగిత్యాలజోన్: మానసిక వికలాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి జి.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.2లక్షల పరిహారం అందించాలని తీర్పుఇచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్.రామకృష్ణారావు కథనం ప్రకారం.. మల్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు నలుగురు ఆడపిల్లలు, కొడుకు. పెద్ద కూతురు మానసిక వికలాంగురాలు. భార్యాభర్తలు గేదెలను కాస్తూ జీవనం సాగిస్తుంటారు. 2021 జూలై 10న గేదెలను మేపేందుకు తండ్రితోపాటు పెద్ద కూతురు, చిన్నకూతురు వెళ్లారు. సాయంత్రం కావడంతో ఇద్దరు కూతుళ్లను అదే గ్రామానికి చెందిన చెట్‌పల్లి నారాయణ ఆటోలో ఇంటికి పంపించాడు. అయితే నారాయణ వారిని తన ఇంటికి తీసుకెళ్లాడు. చిన్న కూతురును ఇంటికి వెళ్లాలని చెప్పి మానసిక వికలాంగురాలుపై అత్యాచారం చేశాడు. అక్క ఏదని తల్లి చిన్నకూతురును అడగగా.. నారాయణ ఇంటి వద్ద ఉందని చెప్పింది. దీంతో వారు నారాయణ ఇంటికి వెళ్లి చూడగా.. కూతురు ఏడ్చుకుంటూ కనబడింది. జరిగిన సంఘటనపై బాధితులు మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అప్పటి సీఐ రమణమూర్తి నారాయణను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు బి.రాజు, కేవీ.సాగర్, కిరణ్‌కుమార్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన జడ్జి నిందితుడైన నారాయణకు 20 ఏళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
బాధితురాలికి రూ.2లక్షల పరిహారం
Comments
Please login to add a commentAdd a comment