ప్రచారంలో కొత్త పుంతలు | - | Sakshi
Sakshi News home page

ప్రచారంలో కొత్త పుంతలు

Published Fri, Feb 21 2025 8:36 AM | Last Updated on Fri, Feb 21 2025 8:33 AM

ప్రచారంలో కొత్త పుంతలు

ప్రచారంలో కొత్త పుంతలు

● అభ్యర్థుల చేతికి ఓటర్ల ఫోన్‌ నంబర్లు ● ఓటు వేయాలని అభ్యర్థనలు.. ఎవరికి వేస్తారనీ సర్వేలు ● ఆన్‌లైన్‌లో వ్యక్తిత్వ హననానికి దిగుతున్న పార్టీలు ● సోషల్‌ మీడియాలో పరస్పర ఆరోపణలకు దిగుతున్న అభ్యర్థులు ● కులాలు, వర్గాల వారీగా ఓటర్లకు విందులు, సమావేశాలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

రీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబా ద్‌ గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు.. అభ్యర్థులు గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తూ ముందుకు సాగేవారు. తనను గెలిపించాలని సభలు, సమావేశాలు పెట్టి విజ్ఞప్తి చేసేవారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగుతున్నాయి. గతంలో ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పార్టీల మధ్య పోటీ కనిపించేది. ఈసారి గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎన్నికల్లో అన్ని ముఖ్య పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగారు.ఫలితంగా వారి ప్రచారం.. తోటి అభ్యర్థులను అవమానించేలా సాగుతోంది. ఆరోపణలు చేసుకుంటూ.. ఓటర్లను కులాల వారీగా, వర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రలోభాలకు దిగుతుండటం, ఓటర్లను ఇబ్బంది పెట్టే ధోరణిలో ఫోన్‌కాల్స్‌ చేస్తుండటం కలవర పెడుతోంది.

సోషల్‌ మీడియాలో ఆరోపణలు

గెలవాలంటూ తామేం చేస్తామో చెప్పుకునే ధోరణి కంటే.. ఎదుటి వారి లోపాలు, వారు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపడమే కొందరు ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు అభ్యర్థులు పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి వారి సోషల్‌మీడియా ద్వారా పరస్పరం దూషించుకుంటున్నారు. వృత్తిపరంగా వ్యవహరించిన విధానాన్ని ఇప్పుడు గుర్తు చేసి వీళ్లేం సేవ చేస్తారు..? అని వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. ఫొటోలను డీటీపీ చేసి వారిని అవమానిస్తున్నారు. అలా నాయకులను కించపరిచేలా మార్చిన ఫొటోలను ఆయా పార్టీ, ఇతర వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఆయా ఫొటోల కింద ఘాటైన పదజాలంతో దుర్భషలాడుతూ కామెంట్లు పెడుతూ చెలరేగిపోతున్నారు. సూటిగా చెప్పాలంటూ ఎన్నికల ప్రచారం కంటే కూడా వ్యక్తిత్వ హననానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో నాయకుడు అసలు ఎన్నికలు జరుగుతున్న తీరే సరిగా లేదని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ప్రతిన బూనిన సంగతి తెలిసిందే.

ఉదయం నుంచి సర్వేలు, కాల్స్‌

గ్రాడ్యుయేట్స్‌, టీచర్స్‌ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల చేతికి ఓటర్ల ఫోన్‌ నంబర్ల జాబితా చిక్కింది. ఫలితంగా ఓటర్లకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారు. ఓటరు జాబితాలో పేరున్న ప్రతీ ఓటరుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. దీనికితోడు ఏ పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు..? అంటూ రోజుకు నాలుగైదు సార్లు వివిధ పార్టీలు ఐవీఆర్‌ ద్వారా ఫోన్‌లో నిర్వహిస్తున్న సర్వేలు చికాకు తెప్పిస్తున్నాయి. ఓటర్లంతా గ్రాడ్యుయేట్లే కావడంతో మీరు చెప్పిన అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి..? అని చాలామంది ప్రశ్నిస్తుండటం గమనార్హం.

విందులు, సమావేశాలు

ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని.. కుల సంఘాల నాయకులకు ఎక్కడాలేని గిరాకీ పెరగింది. పార్టీల అభ్యర్థులందరూ వీరిని మచ్చిక చేసుకుని మరీ సమావేశాలు పెడుతున్నారు. అవససరమైతే మందుపార్టీలు కూడా నడిపిస్తున్నారు. దీంతో కులసంఘాల నేతలు అభ్యర్థులందరినీ సంతృప్తి పరిచేలా వారితో తమ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లతో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇక గ్రాడ్యుయేట్స్‌, టీచర్స్‌, ప్రైవేటు లెక్చరర్లను కూడా విందులతో తమ వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement