‘ఆదివాసీల జీవనాన్ని దెబ్బతీస్తున్న ఆపరేషన్ కగార్’
గోదావరిఖని: ఛత్తీగఢ్‌లో ఆదివాసీల జీవనాన్ని దెబ్బతీసేలా కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని అరుణోదయ రాష్ట్ర నాయకురాలు విమలక్క విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదివాసుల పొట్టకొట్టి అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసమే ఆపరేషన్ కగార్ కొనసాగుతోందన్నారు. అడవులను కాపాడుకోవడం కోసం ఆదివాసీలు చేస్తున్న పోరాటం న్యాయమమన్నారు. నక్సలైట్లు ఆదివాసులు, అడవులకు అండగా ఉంటున్నారని అన్నారు. బహుళజాతి సంస్థలకు రెడ్‌కార్పెట్ పరిచేందుకు ఆపరేషన్ కగార్ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. నక్సలైట్లను ఏరిపారేయడం కోసమంటూ కేంద్రప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ బూటకమన్నారు. నిజమైన దేశభక్తులు విప్లవ కారులేనని విమలక్క అన్నారు. వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని కోరారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి పోరాటం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణతో కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు మాతంగి రాయమల్లు, మేకల పోచమల్లు, జి.రాములు, వెలుతురు సదానందం, రత్నకుమార్, పల్లె లింగయ్య, యాకూబ్, చిన్నయ్య, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment