ముస్తాబాద్(సిరిసిల్ల): ఫైనాన్స్ వారి వేధింపులు..అప్పుల బాధలు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాలు మృతురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ముస్తాబాద్ ఎస్సై గణేశ్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన గట్ల సునీత(45) శుక్రవారం ఉరివేసుకుంది. భర్త నగేశ్‌తో కలిసి సునీత హోటల్ నడిపేది. హోటల్‌లో పనిచేస్తూ ఇంటికి వెళ్లివస్తానని చెప్పి వెళ్లిన సునీత తిరిగి రాలేదు. దీంతో భర్త నగేశ్ ఇంటికి వెళ్లి చూడగా.. సునీత ఉరికి వేలాడుతూ కనిపించింది. సునీతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సునీత చనిపోయే ముందు తన ఆత్మహత్యకు అప్పుల ఇచ్చిన వారి వేధింపులే కారణమని రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి భర్త నగేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లలూ.. నన్ను క్షమించండి
అమ్మ శ్రీవాణి, బబ్లూ నాన్న మీరంటే నాకెంతో ఇష్టం.. నన్న క్షమించండి అంటూ సునీత సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఒక తల్లిగా మీ మంచి చెడ్డలు చూడాల్సిన నేను అవమానభారంతో చనిపోతున్న. మీరిద్దరు నాకు ప్రాణం. నా మనసంతా మీ మీదనే ఉంటది. నన్ను క్షమించండి ఇట్లు మీ అమ్మ అంటూ సునీత ఎంతో బాధతో సూసైడ్‌నోట్ రాసింది. నడిపి అక్క, పెద్దక్క, అమ్మ నా పిల్లలిద్దరిని మన ఊరికి దయచేసి తీసుకెళ్లండి అంటూ సునీత అందులో పేర్కొంది. సునీత రాసిన లేఖను చదివిన వారు కంటతడి పెట్టారు. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment