అక్షరమే నా ఆయుధం
విద్యానగర్(కరీంనగర్): అక్షరమే ఆయుధంగా అక్షర సేద్యం చేస్తున్న వ్యక్తిగా మీ ముందుకొచ్చిన ప్రసన్న హరికృష్ణకు అండగా నిలిచి ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ కోరారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని జ్యోతిరావుపూలే మైదానంలో పట్టభద్రుల సింహగర్జన సభ జరిగింది. సమాజంపై, పట్టభద్రుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులకు ఈ ఎన్నికల్లో అవకాశమివ్వాలన్నారు. ప్రసన్న హరికృష్ణ మీ అందరి కుటుంబ సభ్యుడని, సమాజంపై, పట్టభద్రుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి అని వెల్లడించారు. పట్టభద్రుల సమస్యలపై ఎవరికి అవగాహన ఉందో, ఎవరికి స్పష్టత ఉందో అన్న విషయాన్ని గుర్తించి వారికి ఓటు వేయండని కోరారు. మీరందరు గ్రాడ్యుయేట్స్.. మీ సమస్యలు ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 19 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రులకు సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల బరిలో నిలిచి మీ ముందుకొచ్చానని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా ముఖ్యమంత్రి ప్రచారానికి రావడాన్ని ఎద్దేవ చేశారు. ప్రసన్న హరికృష్ణ ఇచ్చిన మాట మరిచే వ్యక్తి కాదని అన్నారు. ప్రసన్న హరికృష్ణ ఇచ్చిన 8 హామీలైన తన జీతంలో 50 శాతం పేద విద్యార్థుల కోసం, జాబ్ క్యాలెండర్, పోస్టుల పెంపు, నిరుద్యోగులకు ఉచిత కోచింగ్, నిరుద్యోగులకు ఉచిత జాబ్‌మేళాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రైవేట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, గ్రంథాలయాల్లో ఉచిత మధ్యాహ్న భోజనం, విద్యావ్యవస్థ బలోపేతం అంశాలను బాండ్ పేవర్‌పై రాసి ప్రజల సమక్షంలో సంతకం చేశారు. బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, నాయకులు విక్రమ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment