ఐకేపీలో ట్రాక్టర్ అపహరణ
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ ఇందిరా క్రాంతి పథంలోని ట్రాక్టర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. రూ.5లక్షల విలువైన ట్రాక్టర్ అపహరణకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఐకేపీ ఏపీఎం దేవరాజు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.5లక్షలు వెచ్చించి ఐకేపీ ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ను రైతులకు అద్దెకిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే నాటి నుంచి ఇప్పటివరకు రైతులకు అద్దెకివ్వకపోగా.. ఐకేపీ కార్యాలయం పక్కనే ఉన్న షెడ్డులో నాలుగేళ్లుగా వృథాగా ఉంటోంది. ఇదే అదునుగా భావించిన దొంగలు.. షెడ్డు వెనక భాగంలో ఉన్న షట్టర్ ద్వారా లోపలికి ప్రవేశించి ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. మరో షెడ్డులో ఉన్న రూ.60వేల విలువ చేసే కాజాల కుట్టు మిషన్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. నాలుగు రోజుల క్రితమే ట్రాక్టర్, కాజాల కుట్టు మిషన్ అపహరణకు గురైనట్లు ఐకేపీ ఏపీఎం దేవరాజు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలు ఆధారాలు సేకరించాయి. ఎస్సై మాట్లాడుతూ.. ట్రాక్టర్ ఆచూకీ తెలిసినవారు సమాచారమివ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment