చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామ శివారులో ఈనెల 14న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిర్ర పాల్(46) చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన చిర్ర పాల్ తన ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం వెళ్లి ఈనెల 14న స్వగ్రామం నాచుపల్లికి వెళ్తుండగా.. తిప్పన్నపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య చిర్ర గంగజమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ సదాకర్ తెలిపారు.
వ్యవసాయ బావిలో పడి రైతు..
రామడుగు(చొప్పదండి): వెలిచాల గ్రామ పరిధిలోని గుడ్డెలుగులపల్లి గ్రామానికి చెందిన కట్కం సత్తయ్య(50) అనే రైతు వ్యవసాయ బావిలో పడి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కట్కం సత్తయ్య ఆదివారం తన వ్యవసాయ బావిలో నీటిని చూస్తుండగా.. ప్రమాదవశాత్తు అదుపుతప్పి బావిలో పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడన్నారు. రామడుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడి బలవన్మరణం
కథలాపూర్(కోరుట్ల): తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన బోయిని భూమయ్య(78) అనే వ్యక్తి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. భూమయ్య భార్య గతంలో మృతిచెందడంతో మిగతా కుటుంబీకులు వేరుగా నివాసముంటున్నారు. భూమయ్య వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండటంతో.. మనస్తాపానికి గురై శనివారం రాత్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం గుర్తించారు. మృతుడి మనవడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
శునకానికి ఆపరేషన్
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో శునకానికి ఆపరేషన్ చేశారు. మండల కేంద్రానికి చెందిన రత్నాకర్‌రెడ్డికి చెందిన పెంపుడు కుక్క ప్రసవ వేదనతో బాధపడుతుండగా.. రత్నాకర్‌రెడ్డి కోనరావుపేటలోని పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుక్క కడుపులో రెండు పిల్లలుండగా.. ఒకటి సగం వరకు వచ్చి ఆగిపోయింది. దీంతో కుక్కకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. గర్భసంచికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో తొలగించారు. వెటర్నరీ అసిస్టెంట్ వంశీ, గోపాలమిత్రలు శ్రీకాంత్, శ్యామ్ పాల్గొన్నారు.
పిచ్చి కుక్కల దాడిలో ఇద్దరికి గాయాలు
వీణవంక(హుజూరాబాద్): ఘన్ముక్కుల గ్రామంలో కొత్తపల్లి వీరమ్మ(75), సూరమ్మ(70) పిచ్చి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. 108 ఈఎంటీ ఐలవేణి కుమారస్వామి, పైలెట్ మహేందర్ అత్యవసర ప్రథమ చికిత్స అందించి హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఆరుగురిని కుక్కలు కరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. మూడు రోజులుగా కుక్కలు స్వైరవిహారం చేస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment