హక్కుల పరిరక్షణకు ఏకతాటిపైకి రావాలి
గోదావరిఖని: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రజా, కార్మిక, విప్లవ సంఘాలు ఏకతాటిపైకి రావాలని అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క కోరారు. గోదావరిఖనిలోని రాజ్యలక్ష్మి గార్డెన్‌లో ఆదివార నిర్వహించిన ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచీకరణలో భాగంగా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ వేగవంతమైందన్నారు. ప్రజల జీవితాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రపంచానికి వెలుగులు పంచుతున్న ఇక్కడి కార్మికులు చీకట్లో మగ్గుతున్నారని, కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించకుండా యజమానుల స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం బలమైన ప్రజాఉద్యమాన్ని నిర్మించాలని సూచించారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించడం కార్మికుల హక్కులను హరించడమేనని విమర్శించారు. సామ్రాజ్యవాద కుట్రలకు భారత దళారీ పాలక సంఘాలు వంతపాడుతున్నాయని తెలిపారు. ఆంక్షల మధ్య రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నామని, లక్ష్య సాధన కోసం బాధలను దిగమింగుకోవాల్సి వస్తోందని అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రతినిధులు అంబటి నాగయ్య, నాగిరెడ్డి, మాతంగి రాయమల్లు, రత్నకుమార్, మేకల పోచమల్లు, జి.రాములు, మల్లేశం, వెల్తురు సదానందం, సామ అనసూర్య, నాగయ్య, భగవంతరెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
అరుణోదయ నాయకురాలు విమలక్క
Comments
Please login to add a commentAdd a comment