స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
చిగురుమామిడి: మండల కేంద్రానికి చెందిన కవ్వంపల్లి సాయికిరణ్(27) దుబాయిలో గుండెపోటుతో మృతిచెందగా మృతదేహం వారం రోజులకు ఇంటికి చేరింది. స్థానికుల వివరాల ప్రకారం.. సాయికిరణ్ రెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ప్లంబర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలో ఈ నెల 18న గుండెపోటుతో చనిపోయాడు. అతని మృతదేహం గురువారం ఉదయం స్వగ్రామం చేరడంతో తల్లి రాజవ్వ, చెల్లి శ్రావ్య కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ కుటుంబానికి అప్పులున్నాయని, సొంత ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారని స్థానికులు తెలిపారు. కాగా, సాయికిరణ్ తండ్రి 20 ఏళ్ల క్రితం మృతి చెందాడని పేర్కొన్నారు. సాయికిరణ్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకువచ్చేందుకు ఎన్‌ఆర్‌ఐ చిట్టిబాబు అంబులెన్స్ సమకూర్చినట్లు తెలిపారు.
అదనపు కట్నం కేసులో ఏడాదిన్నర జైలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాదిన్నర జైలుశిక్షతోపాటు రూ.3వేలు జరిమానా విధించినట్లు ముస్తాబాద్ ఎస్సై గణేశ్ తెలిపారు. ముస్తాబాద్ మండలానికి చెందిన లక్ష్మిని సిద్దిపేట జిల్లా పుల్లూరుకు చెందిన వనమా యాదగిరి 1996లో వివాహం చేసుకున్నాడు. అనంతరం అదనపు కట్నం కోసం వేధించగా ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదుచేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి సాక్షులను ప్రవేశపెట్టారు. సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment