● దౌర్జన్యం చేశారంటూ పోలీసులకు ఈఈ.. ● వేధిస్తున్నారంటూ కలెక్టర్‌కు కాంట్రాక్టర్ల ఫిర్యాదు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారుల మధ్య వివాదం తీవ్రమైంది. తనపై మున్సిపల్ కాంట్రాక్టర్ వరాల నారాయణ దౌర్జన్యం చేశారంటూ ఈఈ రొడ్డ యాదగిరి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వేధింపులకు గురిచేస్తున్న ఈఈపై చర్యతీసుకోవాలని కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
కాంట్రాక్టర్ దౌర్జన్యం చేశాడు
ఫిబ్రవరి 19వ తేదీన నగరపాలకసంస్థ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఉన్న సమయంలో కాంట్రాక్టర్ వరాల నారాయణ వచ్చి తనపై దౌర్జన్యం చేశాడంటూ అదే రోజు ఈఈ రొడ్డ యాదగిరి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిల్లుకు సంబంధించి నారాయణ తనను అడిగితే, ఏఈ, డీఈలను సంప్రదించాలని సూచించానని, మరి నువ్వెందుకున్నావంటూ తనను తోసేశాడని యాదగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు. యాదగిరి ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ వరాల నారాయణపై పోలీసులు కేసునమోదు చేశారు.
ఈఈ వేధిస్తున్నాడు
ఈఈ యాదగిరి మానసికంగా వేధిస్తున్నాడని, ఆయనపై చర్యతీసుకోవాలంటూ నగరపాలకసంస్థ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ దగ్గు మహేందర్ రాకేశ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు కలెక్టర్ పమేలా సత్పతికి ఫిర్యాదు చేశారు. వరాల నారాయణ తన బిల్లుల గురించి అడిగితే, దుర్భాషలాడాడని, పైగా నారాయణపైనే కేసు పెట్టారన్నారు. బినామీ పేర్లపై కాంట్రాక్ట్ చేస్తున్నారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment