అడవిశ్రీరాంపూర్‌లో పులి సంచారం
ముత్తారం(మంథని): అడవిశ్రీరాంపూర్ అటవీ ప్రాంత కోయచెరువు సమీపంలో ఆదివారం పెద్దపులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పొలాల వద్దకు వెళ్లిన రైతులు పులి అడుగులు కనిపించాయని ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ బేగంపేట సెక్షన్ అధికారి నర్సయ్య, బీట్ ఆఫీసర్ పవన్‌కుమార్ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. కోయచెరువు గుడ్డెలుచెలుక వైపు పులి అడుగులు ఉన్నట్లు గుర్తించారు. దాని వయసు సుమారు నాలుగేళ్లు ఉంటుందని భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా శివారం నుంచి మంథని మండలం ఓదాల, అడవిసోమన్‌పల్లి మీదుగా ఆదివారం ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ అటవీ ప్రాంతంలోకి పులి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాత్రి కావడంతో పులి అడుగులు గుర్తించినా.. సీసీ కెమోరాలు ఏర్పాటు చేయలేక పోయమని సెక్షన్ అధికారి నర్సయ్య తెలిపారు. 2020లో మచ్చుపేట భగుళ్లగుట్టలో పశువును చంపిన పులి.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ముత్తారం మండలంలో ప్రవేశించింది. పులి సంచారం నిజమేనని అటవీశాఖ అధికారులు చెప్పడంతో అడవిశ్రీరాంపూర్ రైతులు పొలాల వద్దకు పోవద్దని నిర్ణయించుకున్నారు. పశువులకాపరులు, రైతులు, రాత్రిపూట ప్రయాణించే వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment