లీకేజీ పరేషాన్
● పైపుల్లో నాణ్యత ఉండదు.. నిబంధనలు పట్టవు ● నగరంలో నిత్యం వాటర్ లీకేజీలే ● శాశ్వత చర్యలపై పట్టింపు లేని బల్దియా
కరీంనగర్ కార్పొరేషన్:
నాసిరకం పైపుల వినియోగం.. నిబంధనలు పా టించకుండా ౖపైపెనే పైపులు వేయడం.. జాయింట్లలోనూ పట్టని జాగ్రత్తలు.. పర్యవేక్షణ మరిచిన అధికారులు.. వెరసి నగరంలో ప్రతీరోజు ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా పైప్‌లైన్ లీకేజీలు.. రోడ్లపై వృథాగా నల్లానీళ్లు.. తాగునీటి నాణ్యతపై నగరవాసులు బేజారు..! ఇది నగరపాలకసంస్థ పరిధిలో జరుగుతున్న తాగునీటి సరఫరాకు సంబంధించిన లీకేజీ వ్యవహారం. నగరంలో 60 డివిజన్లు కాస్తా 66 డివిజన్లుగా మారుతున్నా.. నగరపాలకసంస్థ పరిధి కిలో మీటర్ల మేర విస్తరిస్తున్నా.. అధికారుల పర్యవేక్షణలో మార్పు రావడం లేదు. తరచూ పైప్‌లైన్‌న్ లీకేజీలు అవుతున్నా తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారే తప్ప, అందుకు కారణాలపై దృష్టి పెట్టడం లేదు. శాశ్వత పరిష్కారం వైపు కనీస చర్యలు కనిపించడం లేదు.
నాసిరకమే ఎక్కువ
నగరంలో తాగునీటి సరఫరాకు గతంలో సిమెంట్ పైపులు వాడేవారు. ఆవి త్వరగా పగులుతుండడంతో లీకేజీలు పెరిగేవి. దీంతో హెచ్‌డీపీఈ (హై డెన్సిటీ పాలిథిన్)పైపులను తీసుకొచ్చారు. ఐఎస్‌ఐ మార్క్ కలిగిన ఈ హెచ్‌డీపీఈ పైప్‌లు సంవత్సరాలుగా చెడిపోకుండా ఉండడంతో వీటినే వాడుతున్నారు. నగరంలో పాత సిమెంట్ పైప్‌లైన్ పక్కనపెడితే, కొత్తగా వేస్తున్న హెచ్‌డీపీఈ పైప్‌లు కూడా పగులుతుండడమే ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. వాటర్ ఫ్రెషర్‌కు అనువైన వైశాల్యంతో హెచ్‌డీపీఈ పైప్‌లు వేస్తున్నారు. చాలా చోట్ల నాసిరకం పైప్‌లు వేయడం వల్ల, ఏళ్లపాటు మన్నికగా ఉండాల్సిన పైపులు తరచూ పగిలిపోతున్నాయనే ఆరోపణలున్నా యి. దీంతో కొత్తగా పైప్‌లైన్ వేసిన చోట కూడా లీకేజీలు పెరుగుతున్నాయి. లీకేజీలకు మరమ్మతులు చేసే వాటర్ వర్క్స్ సిబ్బంది కూడా, నాసిరకం పైప్‌లు వేసి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడుతుండడం గమనార్హం.
నిబంధనలు పట్టవు
హెచ్‌డీపీఈ పైప్‌లు నాసిరకం వాడుతుండడమే కాకుండా, పైప్‌లు భూమిలో వేసే సమయంలో నిబంధనలు పాటించకపోవడం కూడా సమస్యగా మారింది. నిబంధనల ప్రకారం దాదాపు మూడు ఫీట్ల లోతులో తవ్వి, ఆఫ్ ఇంచ్ ఇసుక, డస్ట్‌లో ఈ పైప్‌లు వేయాల్సి ఉంటుంది. భారీ వాహనాలు పైప్‌లైన్ మీదుగా వెళ్లినప్పుడు దెబ్బతినకుండా ఇసుక, డస్ట్ పనిచేస్తుంది. ఎక్కడా మూడు ఫీట్ల లోతు కనిపించదు. ఇసుక జాడ కూడా ఉండదు. రెండు ఫీట్లలోపు లోతులోనే పైప్‌లు వేస్తుండడంతో, భారీ వాహనాలు వెళ్లే సమయంలో పైప్‌లు పగుళ్లు చూపుతున్నాయి. పైపుల జాయింట్ల వద్ద కప్లింగ్ వేయాలి. కానీ.. వేడి చేసి పైప్‌లను కలుపుతూ వెళ్తుండడంతో కొద్దిరోజుల్లోనే జాయింట్ల వద్ద లీకేజీ మొదలవుతోంది.
పర్యవేక్షణ మరిచారు
నిబంధనల ప్రకారం పైపులైన్ వేస్తున్నారా, నాణ్యమైన పైపులు వాడుతున్నారా అనేది చూడాల్సిన నగరపాలకసంస్థ అధికారులు పర్యవేక్షణ మరిచారు. నాసిరకం పైప్‌లు, ౖపైపెనే వేయడం కారణంగా తరచూ వాటర్ లీకేజీ అవుతున్నా, ఉన్నతాధికారులు లోతుగా సమస్యపై దృష్టి పెట్టడం లేదు. ఫ్రెషర్‌కు అనుగుణంగా కొత్తగా వేస్తున్న హెచ్‌డీపీఈ పైప్‌లు కూడా పగిలి లీకేజీలవుతుండడమే ఇందుకు నిదర్శనం. గతంలో వేసిన వాల్వ్‌లు సంవత్సరాల పాటు ఉండగా, ప్రస్తుతం వేసే వాల్వ్‌లు ఆరు నెలల్లో మరమ్మతులకు వస్తున్నాయి. నగరపాలకసంస్థ ఉన్నతాధికారులు లీకేజీల అసలు కారణంపై, పైప్‌ల నాణ్యతపై దృష్టి సారిస్తే తప్ప నగరంలో లీకేజీల ప్రవాహానికి అడ్డుకట్ట పడదు.
Comments
Please login to add a commentAdd a comment