బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురి అరెస్ట్
మెట్‌పల్లి: ఇరిగేషన్ శాఖ మెట్‌పల్లి డివిజన్‌లో డీఈఈ లక్కంపల్లి అరుణోదయ్ కుమార్‌ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఎస్సై అనిల్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. రౌడీషీటర్ బత్తుల భరత్, జెట్టి లక్ష్మణ్, రేంజర్ల అజయ్, ఎన్నం రమేశ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా అక్రమదందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గతనెల 12న రేంజర్ల అజయ్ రాజేశ్వర్‌రావుపేటలోని వరదకాలువ నుంచి అక్రమంగా మొరం తరలిస్తుండగా డీఈఈ తమ వర్క్ ఇన్స్‌పెక్టర్ లస్మయ్యతో కలిసి అక్కడకు వెళ్లి అడ్డుకున్నాడు. వెంటనే అజయ్ ఈ విషయాన్ని ఫోన్‌లో రమేశ్‌కు తెలపగా.. అతడు వచ్చి డీఈఈని దూషించడంతోపాటు అట్రాసిటీ కేసు పెట్టిస్తామని బెదిరించాడు. గత్యంతరం లేక డీఈఈ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత భరత్ డీఈఈకి ఫోన్ చేసి అట్రాసిటీ కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అలాగే జెట్టి లక్ష్మణ్ కూడా ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని, లేకుంటే చంపుతామని బెదిరించాడు. దీనికి భయపడిన డీఈఈ భరత్‌కు ఫోన్‌పే ద్వారా రూ.1.10లక్షలు, లక్ష్మణ్‌కు రూ.40వేలు నేరుగా అందించాడు. అయినా వినకుండా మిగతా డబ్బులు కూడా ఇవ్వాలంటూ తరచూ ఫోన్ చేసి బెదిరించసాగారు. వారి వేధింపులు భరించలేక డీఈఈ ఈనెల 6న ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న నలుగురిలో భరత్, లక్ష్మణ్, అజయ్‌ని జిల్లా సరిహద్దు గండి హనుమాన్ ఆలయ సమీపంలో పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.80వేలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రమేశ్ పరారీలో ఉన్నా డు. సర్కిల్ పరిధిలో పంచాయితీలు, సెటిల్‌మెంట్లు చేస్తూ ప్రజలను బెదిరింపులకు గురి చేయడం మానుకోవాలని, లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
రూ.80వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment