
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పెగడపల్లి: మండలంలోని బతికపల్లిలో ఈనెల పదో తేదీన కారు ఢీకొట్టిన ఘటనలో గాయపడిన సయ్యద్ సర్వర్ పాష (55) చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతిచెందాడు. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం.. సయ్యద్ సర్వర్ పాష, సయ్యద్ జాకీర్ పాష అన్నదమ్ములు. ఈనెల 10న రాత్రి సమయంలో నమాజ్ చేసేందుకు మసీదుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో పంగ రాజయ్య మద్యం సేవించి అతి వేగంతో కారు నడుపుతూ వచ్చి వీరిని వెనుక నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన వీరిని కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సయ్యద్ సర్వర్ పాష మృతి చెందాడు. జాకీర్ పాష పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు ఎస్సై తెలిపారు. సయ్యద్ సర్వర్ పాషకు ముగ్గురు కూమారులు సంతానం. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
మెట్‌పల్లిలో ఒకరు..
మెట్‌పల్లిరూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన లింగంపల్లి వెంకన్న(60) గత నెల 25న ద్విచక్రవాహనంపై మెట్‌పల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మల్లాపూర్ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెంకన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వెంకన్నను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న వెంకన్న పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడు అంజ య్య ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ శ్రీని వాస్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కరీంనగర్‌లో కారు ఢీకొని..
కరీంనగర్‌క్రైం: నగరంలోని సిరిసిల్ల బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన వాల యాదగిరిరావు (57) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం తన బైక్‌పై సిరిసిల్ల బైపాస్ నుంచి రాంనగర్ వైపునకు వెళ్తున్న క్రమంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. రోడ్డుపైన పార్కింగ్ చేసిన లారీకి యాదగిరిరావు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీలో బదిలీలు, పదోన్నతులు
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లకు బదిలీలు, పదోన్నతి కల్పిస్తూ బుధవారం బస్‌భవన్ నుంచి ఉత్తర్వులు వెలుపడ్డాయి. కరీంనగర్–2 డిపో మేనేజర్ వి.మల్లయ్యకు ఖమ్మం డిప్యూటీ ఆర్‌ఎంగా పదోన్నతి కల్పించారు. కరీంనగర్–2డిపో మేనేజర్‌గా బోధన్ డీఎం ఎం.శ్రీనివాసులును బదిలీ చేశారు. కరీంనగర్ డిప్యూటీ ఆర్‌ఎంగా బీవీ.రావు, జగిత్యాల డీఎంగా జి.సునీత, హుస్నాబాద్ డీఎం వెంకటేశ్వర్లు కుషాయిగూడకు, దిల్‌సుఖ్‌నగర్ డిపో మేనేజర్ వెంకన్నను హుస్నాబాద్‌కు బదిలీ చేశారు.
నేడు అనభేరి వర్ధంతి
కరీంనగర్: స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం గుండెల్లో రణభేరి మోగించిన అనభేరి ప్రభాకర్‌రావు 77వ వర్ధంతిని బుధవారం నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తెలిపారు. జిల్లాకేంద్రంలోని కూరగాయల మార్కెట్ వద్ద గల అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వద్ద, మహ్మదాపూర్‌లో నిర్వహించే వేడుకల్లో సీపీఐ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment