● కమిషనర్ చాహత్‌బాజ్‌పేయ్
కరీంనగర్‌కార్పొరేషన్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో బల్దియాకు మొదటి ర్యాంకు వచ్చేలా కృషి చేస్తూ, ప్రజలను భాగస్వాములను చేయాలని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అన్నారు. సోమవారం మెప్మా ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘ సభ్యులు, సీవోలు, శానిటేషన్ జవానులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఎస్‌హెజ్‌జీ సంఘాల సభ్యులు, ఆర్పీలు డివిజన్ వారీగా ప్రతి ఇంటిని సందర్శించి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పారిశుధ్య జవానులు రోజూ డోర్ టూ డోర్ కలెక్షన్ చేయడంతో పాటు ఇంటి వద్దే యజమానులు చెత్త వేరు చేసేలా చూడాలని పేర్కొన్నారు. డివిజన్‌లలో నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన డీఆర్‌సీసీలు, త్రిబులార్ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ఇంటికి స్వచ్ఛ ఆటో, రిక్షా వెళ్లి చెత్తను సేకరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 3 నెలల పాటు కొనసాగుతుందని, నగర పరిశుభ్రత విషయంలో జవానులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. 21న జరిగే బల్క్ వేస్ట్ ఎక్స్‌పో సమావేశంలో హోటల్స్, రెస్టారెంట్స్ వారు పాల్గొనేలా జవానులు చర్యలు తీసుకోవాలన్నారు. నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వాములై సహకరించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ వేణుమాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.