సిరిసిల్లటౌన్/కోనరావుపేట: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రైతులు అవలంబిస్తున్న ఆధునిక సాంకేతికత వ్యవసాయాన్ని ఇండో–జర్మనీ బృందం శుక్రవారం పరిశీలించింది. రైతులు పాటిస్తున్న పద్ధతులను అభినందించారు. జిల్లాలో సోలార్ విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం శ్రీరాములపల్లి, మామిడిపల్లి, నాగారం గ్రామాల్లో ట్రయల్‌రన్‌లో ఉన్న శ్రీఆక్రాట్ ప్రాజెక్టుశ్రీ పనులను తిలకించారు. ఆయా గ్రామాల్లోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో)కు చెందిన పంట పొలాలను సందర్శించారు. ఆక్రాట్ ప్రాజెక్టు కింద రైతులు వినియోగిస్తున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వారు పొందుతున్న లాభాల గురించి తెలు సుకున్నారు. అనంతరం సిరిసిల్ల సెస్ కార్యాలయంలో చైర్మన్ చిక్కాల రామారావు చాంబర్‌లో ప్రెస్‌మీట్‌లో ఫెడరల్ మంత్రిత్వశాఖ ఆసియా విభాగం ప్రధానిగా పనిచేస్తున్న మిస్ రిబెక్కా రిడ్డర్ మాట్లాడుతూ.. ఆక్రాట్ ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫ్రౌన్హోఫర్ ఏఏఐ నుంచి డాక్టర్ సెబాస్టియన్, డాక్టర్ రఘు ప్రాజెక్టు పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాబార్డ్ డీజీఎం శ్రీకాంత్ ప్రాజెక్టు పనితీరును అభినందించారు.
సెస్ సభ్యులే..పెట్టుబడి దారులు
ఇండో–జర్మన్ సహకారంతో జిల్లాలో ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్‌ప్లాంటులో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సభ్యులు పెట్టుబడిదారులవుతారని ఆ సంస్థ చైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. ఇండో–జర్మనీ బృందం సభ్యులతో సహకార రంగంలో విద్యుత్ సరఫరా సంస్థ ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు. సోలార్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30శాతం, కేంద్ర ప్రభుత్వం 30శాతం, జర్మనీ సంస్థ 40శాతం నిధులు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. సెస్ పరిధిలో సోలార్‌హబ్ ఏర్పాటైతే సంస్థ సభ్యులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరలో లభిస్తుందన్నారు. ఇందుకు కృషి చేస్తున్న వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, ఇండో–జర్మనీ సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండో–జర్మనీ బృందంలో పీజేటీఏయూ పరిశోధన డైరెక్టర్ డాక్టర్ బలరామ్, అగ్‌హబ్ సీఈవో విజయ్ నడిమింటి, ఆ క్రాట్ ప్రాజెక్టు మేనేజర్ ముకేశ్ రామగోని, సేవ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కృష్ణ, నాబార్డ్ కరీంనగర్ డీడీఎం జయప్రకాశ్, దిలీప్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ తిరుపతి, ఏవో శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
సుముఖత వ్యక్తం చేసిన ఇండో–జర్మనీ బృందం
కోనరావుపేట మండలంలో పర్యటన
ఆక్రాట్ ప్రాజెక్ట్ సాంకేతిక ట్రయల్ పరిశీలన
రైతుల సాంకేతిక సాగుపై అభినందనలు
సిరిసిల్లలో సోలార్‌ప్లాంట్