మంథని: వ్యవసాయ పనుల కోసం కూలీలను తీసుకెళ్తున్న ఆటో పెద్దపల్లి జిల్లా కాటారం– మంథని ప్రధాన రహదారి నాగేపల్లి క్రాస్ వద్ద బోల్తాపడిన ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా కరీంనగర్, గోదావరిఖని ఆస్పత్రులకు తరలించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన 16 మంది మహిళా కూలీలు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారంలో మిర్చి ఏరేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో ఆటో స్టీరింగ్ రాడ్ ఊడి అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని కూలీలకు గాయాలయ్యాయి.
ఆస్పత్రులకు తరలింపు..
ఆటో బోల్తాపడిన ఘటనలో గాయపడినవారిని దారివెంట వచ్చే వాహనాలతోపాటు స్థానికులు సమకూర్చిన వాహనాల్లో మంథనిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బొందల కిష్టమ్మ తల, అప్పాల శైలజ చేయి, అప్పల వనిత భుజానికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. గడ్డి మల్లక్క, సత్తమ్మ, సమత, ఎర్రమ్మ, కందుల రాజేశ్వరి, పోసక్క, కోలగాని సమ్మక్క, గౌరక్క, జంగ లక్ష్మి, కమ్మబోయిన స్రవంతి, కమల, బోధ మల్లమ్మతోపాటు మరో మహిళా కూలీని పెద్దపల్లి, గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. డ్రైవర్ సతీశ్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడినవారిని గోదావరిఖనిలో ఏసీపీ రమేశ్, మంథని సీఐ రాజు, ఎస్సై రమేశ్‌తోపాటు పోలీస్ సిబ్బంది కలిసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
16 మంది మహిళా కూలీలకు గాయాలు
మిర్చి ఏరేందుకు తీసుకెళ్తుండగా బోల్తాపడిన ఆటో
ముగ్గురి పరిస్థితి విషమం.. ఆస్పత్రులకు తరలింపు
స్టీరింగ్ ఊడి.. బోల్తా పడి
స్టీరింగ్ ఊడి.. బోల్తా పడి