పాలకుర్తి(రామగుండం): కొత్తపల్లి గ్రామంలో వేల్పుగొండ కొమురయ్యకు చెందిన గూన పెంకుటిల్లు ఆదివారం విద్యుదాఘాతంతో దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. కొమురయ్యతోపాటు కుటుంబసభ్యులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఇంట్లోంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు.. కొమురయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పెద్దపల్లిలోని అగ్నిమాపక సిబ్బందికీ సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.2లక్షలతోపాటు 5తులాల బంగారం, గృహోపకరణాలు, బట్టలు పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు రోదిస్తూ తెలిపాడు.
రేషన్‌బియ్యం పట్టివేత
పోలీసులు పట్టుకున్న రేషన్ బియ్యం
వీణవంక(హుజూరాబాద్): అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు.. ఇద్దరు వ్యక్తులు వ్యాన్‌లో రేషన్ బియ్యం తీసుకొని కరీంనగర్ వైపు వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేయడంతో 160క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. హుజూరాబాద్ మండలం శాలపల్లికి చెందిన వ్యాన్ డ్రైవర్ గద్దల రవి, జమ్మికుంటకు చెందిన తాడేం రమేశ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.