కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ అర్బన్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కొనుగోలు కమిటీ సభ్యులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యం పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేసేలా రైతులకు, హార్వెస్టింగ్ మిషన్ ఆపరేటర్లకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు, గన్నీ సంచులు, టార్ఫాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న ప్యాడీ క్లీనర్లతో పాటు మరో 15 కొనుగోలు చేయాలని సూచించారు.
అన్ని కొనుగోలు కేంద్రాల్లో 24గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు తర్వాత వెంటనే వివరా లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. రైతుకు సకాలంలో సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకాల ధాన్యాలు వేర్వేరు ప్రదేశాల్లో ఉండేలా చూడాలని సూచించారు. ఎండాకాలం దృష్ట్యా రైతులకు నీడ, తాగునీటి సౌకర్యం ఉండేలా చూడాలని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా పౌరసరఫ రాల సంస్థ మేనేజర్ మంగళారపు రజనీకాంత్, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు పాల్గొన్నారు.