
కిలోమీటరు పొడవు.. 25 పిల్లర్లు
● పెద్దపల్లి–మంచిర్యాల జిల్లాల మధ్య వారధి పనులు షురూ ● గోదావరిపై మరో వంతెన నిర్మాణానికి రూ.125 కోట్లు మంజూరు
మంథని: మంచిర్యాల – పెద్దపల్లి జిల్లా మధ్యలోని గోదావరి నదిపై మరో హైలెవల్ వంతెన పనులు మొదలయ్యాయి. ఇందుకోసం జిల్లాలోని మంథని సమీప గోదావరి నుంచి మంచిర్యాల జిల్లా శివ్వారం వరకు కిలోమీటరు పొడవుతో 25 పిల్లర్లతో వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం రూ.125 కోట్లు ఇటీవల మంజూరు చేసింది. గత సంవత్సరం డిసెంబర్‌లో పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చాయి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీ.. నాలుగు రోజులుగా పనులు చేస్తోంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. రెండు జిల్లాల మధ్య దూర భారం తగ్గుతుంది.
రెండు జిల్లాల్లో సంబరాలు
మంథని సమీప గోదావరిపై వంతెన నిర్మాణం కోసం పెద్దపల్లి–మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వారధి పనులు ప్రారంభం కావడంతో తమ కల నెరవేరబోతుందని సంబురం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నుంచి మంచిర్యాల జిల్లా శివ్వారం, పౌనూరు, వేలాల, సోమన్‌పల్లికి వెళ్లేందుకు బస్సు మార్గంలో అయితే గోదావరిఖని, ఇందారం, టేకుమట్ల, శెట్‌పల్లి, కుందారం, కిష్టాపూర్ మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇందుకోసం సుమారు 60 కి.మీ. – 70 కి.మీ. వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే చెన్నూర్‌కు గోదావరిఖని, జైపూర్ మీదుగా ప్రయాణం చేస్తున్నారు. మరోవంతెన నిర్మాణం పూర్తయితే మంథని నుంచి శివ్వారం ఆరు కిలో మీటర్లు, చెన్నూర్ వరకు 26 కిలో మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. రెండు జిల్లాలకు చెందిన అనేక మంది రైతుల పంట పొలాలు మంచిర్యాల జిల్లావైపు ఉన్నాయి.
జాతీయ రహదారులకు అనుసంధానం
గోదావరిపై మరోవంతెన నిర్మాణం పూర్తయితే మంచిర్యాల– పెద్దపల్లి జిల్లాకు ప్రధానం చెన్నూరు పట్టణానికి దూరం తగ్గడమే కాకుండా జాతీయ రహదారులకు సమీపంలోనే అనుసంధానం అవుతుంది. అంతర్ రాష్ట్ర వంతెన నిజామాబాద్–జగ్దల్‌పూల్ జాతీయ రహదారి కేవలం 25 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. అంతేగాకుండా అన్నారం బ్యారేజీ, వంతెన 22 కి.మీ., అలాగే కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవేకు పది కి.మీ. ధ్యలోనే వంతెన నిర్మిస్తున్నారు. అలా రెండు జాతీయ రహదారులకు మధ్య గోదావరి నదిపై మంథని– శివ్వారం వంతెన పూర్తయితే జిల్లా, రాష్ట్రాల మధ్య రాకపోకలు మెరుగుకానున్నాయి. మంచిర్యాల జిల్లా వేలాల కేవలం ఆరు కి.మీ. దూరంలోనే ఉంటుంది. దీంతో పుణ్యక్షేత్రానికి జిల్లానుంచి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆలయాల సమీపంలోనే..
గోదావరి తీరంలోని శ్రీగౌతమేశ్వర, రామాలయం, సరస్వతీ దేవాలాయలకు అటు వైపుగా వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మించనున్నారు. గోదావరిపై నిర్మించే వంతెన పనులు కొత్త శ్మశానవాటిక పక్కనుంచి, దేవాలయాలయ సమీపం నుంచి పంట పొలాల మీదుగా, మంథని నుంచి గోదావరి వచ్చే చిన్నకల్వర్లు వద్ద కలుపనున్నారు. భూసేకరణ సమస్య పెద్దగా లేకుండా వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు.
నిబంధలనకు లోబడి పనులు
మంథని నుంచి శివ్వారం వరకు వంతెన నిర్మాణానికి అగ్రిమెంట్ పూర్తిచేసుకున్న ఏజెన్సీ ర్యాంపు పనులు మొదలు పెట్టింది. అన్నిరకాల పరీక్షలు, డిజైన్ పూర్తయిన తర్వాత పిల్లర్ల నిర్మాణం చేపడతారు. నిబంధనలకు లోబడి పనులు నిర్వహిస్తారు.
– జఫార్, డీఈఈ, ఆర్‌అండ్‌బీ, మంథని
అభివృద్ధికి ఆస్కారం
మంథని వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో రెండు జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అటువైపు నుంచి ఆ జిల్లావాసుల వివిధ పనులు కోసం మన జిల్లాకు రావడం మొదలవుతుంది. దీంతో మంథనిలో వ్యాపార, వాణిజ్య వ్యవస్థ మరింత బాగుపడుతుంది. సమీపంలో ఉన్న శ్రీపాదకాలనీకి మేలు జరుగుతుంది.
– బెజ్జంకి డిగంబర్, శ్రీపాదకాలనీ, మంథని

కిలోమీటరు పొడవు.. 25 పిల్లర్లు

కిలోమీటరు పొడవు.. 25 పిల్లర్లు