కరీంనగర్‌టౌన్: రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కన్నా దారుణంగా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందన్నారు. రైతు రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 14 పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొని, సన్నవడ్లకే ఇస్తామన డం సిగ్గుచేటన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడటం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రెడ్డబోయిన గోపి, యాదగిరి, కర్ర సంజీవరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి, బొడిగె శోభ, సునీల్ రావు, శంకర్, బాస సత్యనారాయణ, గుగ్గిలపు రమేశ్ పాల్గొన్నారు.
పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఆస్తి, వాణిజ్య, నల్లా పన్నులు చెల్లించి నగరపాలకసంస్థ అభివృద్ధికి సహకరించాలని డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి కోరారు. ఇందిరాగార్డెన్‌కు చెందిన పన్ను బకాయిలను నిర్వాహకులు డిప్యూటీ కమిషనర్‌కు చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం రెండు రోజుల్లో ముగుస్తున్నందున, 90 శాతం వడ్డీమాఫీతో పన్నులు చెల్లించాలన్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ప్రభుత్వం కల్పించిన 90 శాతం వడ్డీ మాఫీని నగరవాసులు వినియోగించుకోవాలన్నారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా, ఆన్‌లైన్‌లో, మీసేవ ద్వారా పన్నులు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
సిటీలో పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: 100 కేవీఏ నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11 కెవీ శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలోని విద్యానగర్, బీరప్ప కమాన్, కొత్తయాస్వాడ, ఇండస్ట్రీయల్, వేంకటేశ్వర కమాన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. సబ్‌స్టేషన్ల నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు 33/11 కేవీ బావుపేట, ఆసిఫ్‌నగర్ సబ్‌స్టేషన్ల పరిధిలోని ఎలగందుల, ఆసిఫ్‌నగర్, బావుపేట గ్రామాలతో పాటు గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు.
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
కరీంనగర్: పదోతరగతి భౌతికశాస్త్రం పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగిందని డీఈవో సీహెచ్.జనార్దన్‌రావు తెలిపారు. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 12,521మందికి గా ను 12,506మంది హాజరయ్యారని తెలిపారు. 15మంది విద్యార్థులు గైర్హాజరు కాగా ప్రైవేట్ విద్యార్థులు 18మందికి 13మంది హాజరు అ య్యారని, ఐదుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన తనిఖీ బృందాలు 16 పరీక్ష కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ మూడు పరీక్ష కేంద్రాలను, జిల్లా విద్యాశాఖాధికారి ఒక పరీక్ష కేంద్రం, రాష్ట్ర పరిశీలకులు నాలుగు పరీక్ష కేంద్రాలను మొత్తంగా 24 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈవో వెల్లడించారు.
ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి తనిఖీ
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషాఖాన్ శుక్రవారం జోనల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన పెల్ కౌంటర్, అల్ట్రాసౌండ్, 2డీఈకో, మానిటర్స్, డీఫిబ్రిలేటర్, ప్రతిపాదిత ఐసీయూ రూంను పరిశీలించారు. వేసవిలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జోనల్ ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ గిరిసింహారావు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) బీవీ.రావు, కరీంనగర్, వర్క్స్ మేనేజర్ సుగుణాకర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.మధుసూదన్, వి.మల్లయ్య, వైద్యులు వసుధ, శివ పాల్గొన్నారు.