● రేషన్ దుకాణాలపై రెవెన్యూ నజర్ ● సీబీ, భౌతిక నిల్వలపై ఆరా ● కొన్న బియ్యాన్ని ఖాళీ చేసేందుకు డీలర్ల మల్లగుల్లాలు
కరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి యుద్ధప్రతిపాదికన చర్యలు చేపడుతుండగా పాత నిల్వలపై రెవెన్యూ దృష్టిసారించింది. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనుండగా ఇప్పటికే 40శాతం మూవ్‌మెంట్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ క్రమంలో దొడ్డు బియ్యం నిల్వలను భౌతికంగా పరిశీలించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించగా రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. జిల్లాలో 566 రేషన్ దుకా ణాలుండగా గిర్దావర్లు స్టాక్‌ను పరిశీలిస్తున్నారు. దుకాణంలో భౌతికంగా ఉన్న బియ్యం, రికార్డులో చూపిన బియ్యమెంత, క్లోజింగ్ బ్యాలెన్స్‌లో చూపిందెంత అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే పలు దుకాణాల్లో రేషన్ బియ్యం ఇంకా నిల్వ ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
తనిఖీలతో డీలర్ల అయోమయం
ఇక సన్నబియ్యమే రానుండటంతో దొడ్డుబియ్యానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. టిఫిన్ సెంటర్ నిర్వాహకులు, రెస్టారెంట్లు, దాబాల నిర్వాహకులు భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రేషన్ డీలర్లు ఇప్పటివరకు కిలోకు రూ.17కు విక్రయించగా రూ.20కి పెంచేశారు. రెవెన్యూ అధికారుల ఆకస్మిక తనిఖీలతో డీలర్లలో ఆందోళన నెలకొంది. జిల్లాలో 40శాతం డీలర్లు కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు పక్కా సమాచా రం. కార్డుదారులకు ఉచితంగా బియ్యం వస్తుండగా వారివద్ద రూ.12 నుంచి రూ.14కు కొనుగోలు చేసి అదే దుకాణంలో నిల్వ చేస్తున్నారు. వచ్చిన బియ్యం, పంపిణీ చేసిన బియ్యం, కొనుగోలు చేసిన బియ్యం లెక్కల కోసం ప్రత్యేకంగా బుక్ నిర్వహిస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా ఎక్కువగా టిఫిన్ సెంటర్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, ఇతర రాష్ట్రాలకు తరలించే బ్రోకర్లకు విక్రయిస్తున్నారు. అయితే ఆకస్మికంగా తనిఖీలు జరుగుతుండటంతో నిల్వలను తరలించేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 16మండలాల్లో 40మంది గిర్దావర్లు తనిఖీలను నిర్వహిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని, భౌతిక నిల్వలు, క్లోజింగ్ బ్యాలెన్స్‌లలో తేడాలుంటే డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు స్పష్టం చేశారు.