
ధనికులు తినే సన్నబియ్యం పేదలకిస్తున్నాం
కరీంనగర్‌కార్పొరేషన్: ధనికులు తినే సన్నబియ్యాన్ని తమ ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్‌పై సన్నబియ్యం పథకాన్ని మంగళవారం నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలోని 566 రేషన్ షాప్‌ల ద్వారా 2,76,930 రేషన్‌కార్డులపై 8 లక్షల 10 వేల మందికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అర్హులకు రేషన్‌కార్డులు ఇస్తామని పేర్కొన్నారు.
తాగునీటికి ఢోకా లేదు
కరీంనగర్‌లో తాగునీటికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి స్పష్టం చేశారు. కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తాగునీటి అవసరాల కోసం జూలై 31 వరకు ఎల్‌ఎండీలో 6.90 టీఎంసీలు అవసరం ఉంటాయన్నారు. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి 3 టీఎంసీలు వదలడం జరుగుతుందని, దీంతో ఎల్‌ఎండీలో 8.70 టీఎంసీల నీళ్లు ఉంటాయన్నారు. సాగుఅవసరాలకు ఈ నెల 6 వరకు 2,500 క్యూసెక్కుల నీళ్లు ఆయకట్టుకు వదులుతారని, దీంతో ఎల్‌ఎండీలో 6.900 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయని, తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదని వివరించారు. అలాగే స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం బలహీనవర్గాలకు న్యాయం చేయాలని బుధవారం బీసీ సంఘాలు ధర్నా చేపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తనతోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి కొండా సురేఖ తదితరులు ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. బీజేపీలోని బీసీ నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్‌ను కూడా కలిసి సహకరించాలని అడుగుతామన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీఎస్‌వో నర్సింగరావు, సివిల్‌సప్లై డీఎం రజనీకాంత్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్‌రెడ్డి, నాయకులు ప్రకాశ్, నేతికుంట యాదయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
● రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్