
జలం.. మేల్కొంటేనే పదిలం
నీటిని పొదుపు చేద్దాం
● భూగర్భజలాలను కాపాడుకుందాం ● రోజువారీ అవసరాలు, సాగుకు నీటి వినియోగం ఎక్కువే ● వృథా చేయకుండా వినియోగిస్తేనే మేలు ● జలవనరుల సంరక్షణతోనే మనుగడ
కరీంనగర్‌అర్బన్: ప్రపంచమంతా జలవనరుల సంరక్షణ, నీటి కాలుష్యంపై దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీరు లేకుంటే ప్రపంచం లేదు.. జీవరాశుల ఉనికే లేదు. ప్రకృతి ప్రసాదించిన నీటి లభ్యతను బట్టే జనావాసాలు, గ్రామాలు ఏర్పడ్డాయి. నీరు లభ్యం కాని ప్రాంతాలు ఎడారులుగా, బీడు భూములుగా మిగిలిపోయాయి. ఈనేపథ్యంలో విచ్చలవిడిగా చెట్లను నరికేయడం, ప్లాస్టిక్ వినియోగం భూగర్భ జలాల ఉనికికే ప్రమాదంగా మారింది. తాగునీటికి అల్లాడే పరిస్థితి రాబోతోంది. భూగర్భజలాలు రోజురోజుకు పడిపోతుండటంతో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ఈ క్రమంలో నీటిని పొదుపుగా వాడుతూ.. జల సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం అత్యవసరం.
ఎండిపోయిన బోరుబావుల రీచార్జి ఇలా..
నగరంలోని చాలా అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోని బోర్లు మార్చిలో వట్టిపోతాయి. ఎండిపోయిన బోర్లలో మళ్లీ సమృద్ధిగా నీరు రావాలంటే ఇంజక్షన్ బోర్‌వెల్ విధానం మేలని అంటున్నారు నిపుణులు. బోరుబావి కేంద్రంగా తీసుకొని 6 X6 X6 అడుగుల కొలతల ప్రకారం గుంత తీయాలి. గుంత కింద నుంచి పీవీసీ పైపు చుట్టూ ప్రతి 3 అంగుళాలకు ఒకటి చొప్పున 12ఎంఎం రంధ్రాలను 3 అడుగుల వరకు చేయాలి. ఆ రంధ్రాలు ఉన్న చోట పైపు చుట్టూ స్టీల్ జాలీ చుట్టాలి. పై ప్రాంతాన్ని పూర్తిగా అరచేయి సైజు గల దొడ్డు కంకర (60ఎంఎం లేదా 40ఎంఎం)తో నింపాలి. ఇలా నిర్మించిన ఇంకుడుగుంత ఎంత పెద్ద వర్షం కురిసినా ఆ నీరు పైపు చుట్టూ ఉన్న రంధ్రాల ద్వారా లోపలికి వెళ్తోంది. వర్షం కురిసిన తర్వాత గుంత పైభాగంలో ఒండ్రు మట్టి చేరితే దొడ్డు ఇసుకను నీటితో కడిగి మళ్లీ వాడాలి.
ఇవిగో పథకాలు
ప్రభుత్వం పలు పథకాల ద్వారా నీటిని పొదుపుగా వాడుకునేందుకు రాయితీలు ప్రకటించింది. వాటర్‌షెడ్, నాబార్డు ద్వారా రుణాలు, సూక్ష్మనీటి సేద్యం ద్వారా 90, వంద శాతం రాయితీతో బిందు, తుంపర పరికరాలు అందిస్తున్నారు. అలాగే సుస్థిర వ్యవసాయం ద్వారా బీడు భూముల్లో సాగునీరు అందించేందుకు ఫాంపాండ్లు, నీటి నిల్వ గుంతలు నిర్మిస్తున్నారు. దీంతో పాటు డీఆర్డీఏ ద్వారా నీటి ట్యాంకులు, పశువుల నీటితొట్టి, చేపల చెరువులు, పండ్ల తోటల పెంపకానికి నీటి నిల్వ కేంద్రాలను 50శాతానికి పైగా రాయితీతో నిర్మిస్తున్నారు. అలాగే బావుల్లో పూడిక తీత, నూర్పిడి కల్లాలు నిర్మిస్తున్నారు.
బిందు, తుంపర సేద్యమే మేలు
పంట పండాలంటే నీరు ఎంతో అవసరం. అయితే ఏ పంటకు ఎంత నీరు అవసరమవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్క వ్యవసాయ రంగాన్నే ప రిగణనలోకి తీసుకుంటే జిల్లాలోని జల వనరుల్లోంచి 70శాతం నీటిని ఉపయోగించుకుంటున్నాం. నీ టి వృథా కూడా వ్యవసాయంలోనే ఎక్కువని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రైతులు వినియోగించుకునే ప్ర తి 5గ్యాలన్ల నీటిలో కేవలం 2 గ్యాలన్ల నీరు మా త్రం సద్వినియోగం అవుతున్నట్లు లెక్కకట్టారు. దీ ని ప్రకారం 60శాతం, కాలువ కింద భూముల్లో 45–55, బావుల కింద పొలాల్లో 15–25 శాతం నీ రు వృథా చేస్తున్నారు. వర్షపు నీటిలో 30శాతం మా త్రమే భూగర్భంలోకి, మిగిలినదంతా వృథాగా వె ళ్లి పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో బిందు, తుంపర సేద్యం ఎంతో ఉపయుక్తం. సాగునీటిని పొదుపుగా వాడుకోవడంతో విస్తీర్ణం కూ డా పెంచుకోవచ్చు. వాస్తవానికి ఎకరం వరి పండించే నీటితో నాలుగెకరాల పత్తిని సాగు చేసుకోవచ్చు.
ఒక మనిషికి ఎన్ని నీళ్లు
అవసరం (రోజుకు)
తాగునీరు: 5 లీటర్లు
వంటకు: 10 లీటర్లు
కాలకృత్యాలకు: 25 లీటర్లు
స్నానం చేసేందుకు: 30 లీటర్లు
బట్టలు ఉతికేందుకు: 20 లీటర్లు
ఇతర అవసరాలకు: 10 లీటర్లు
గణాంకాల్లో నీటి వినియోగమిలా..
జిల్లా జనాభా: 10,05,711
నివాసాలు: 2,58,485
కుటుంబాలు: 2,90,657
రోజుకు నీటి అవసరం(అంచనా):
8.05కోట్ల లీటర్లు
సాగు రంగానికి వినియోగమిలా..
మొత్తం సాగుభూమి:
3,36,075 ఎకరాలు
వరి సాగు: 2,75,300 ఎకరాలు
ఎకరం వరికి పంట మొత్తానికి వాడుతున్న నీరు(అంచనా): 48 లక్షల లీటర్లు
పత్తి ఎకరానికి వాడుతున్న నీరు:
24 లక్షల లీటర్లు
మొక్కజొన్నకు ఎకరాకు :
20 లక్షల లీటర్లు
మిరప: 32 లక్షల లీటర్లు
పుచ్చ,కర్బూజ, దోస: 16 లక్షల లీటర్లు
వృథాకు ఇలా అడ్డుకట్ట
పట్టణాలు, గ్రామాల్లో ఒక్కో కుటుంబం నిత్యం అన్ని అవసరాల్లో సుమారు 50లీటర్ల నీటిని వృథా చేస్తోందని అంచనా. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ వినియోగాన్ని గణనీయంగా తగ్గించొచ్చు.
వంట సమయంలో బియ్యం కడిగేటప్పుడు నీటిని వృథాగా పారబోస్తాం. ఆ నీటిని మొక్కలకు పోయడంతో ఆదా చేసినట్లవుతుంది.
వంట చేసే సమయంలో చాలా మంది ట్యాప్‌ను ఆన్‌చేసి వదిలేస్తుంటారు. పాత్రల్ని కడిగే సమయంలోనూ ఇదే పరిస్థితి. మొత్తం పాత్రల్ని శుభ్రం చేసిన తర్వాత సన్నని ధారపెట్టి కడగాలి.
స్నానానికి వినియోగించే బకెట్ నీటి సామర్థ్యం 15 నుంచి 20లీటర్లు. చాలామంది ట్యాప్ వదిలేసి స్నానం చేస్తుంటారు. దీంతో ఒక్కొక్కరు రెండుమూడు బకెట్ల నీటిని వినియోగించినట్లే.. ఒక్క బకెట్‌తో స్నానాన్ని చేయొచ్చు.
బట్టలు ఉతికేటప్పుడు ఒక్కో జతకు ఒక్కో బకెట్ వాడకుండా ఒకసారి శుభ్రం చేసిన నీటిలో మరొక జతను శుభ్రం చేసి, తర్వాత మళ్లీ ఫ్రెష్ నీళ్లలో శుభ్రం చేస్తే నీటిని పొదుపు చేయవచ్చు.
బ్రష్ చేసుకున్న తర్వాత దానిని ట్యాప్ కింద పెట్టి కడుగుతుంటారు. అలా చేయకుండా మగ్గులో నీటిని తీసుకుని కడుక్కోవాలి. భోజనం తర్వాత చేతులు కడిగేందుకు ట్యాప్‌ను పూర్తిస్థాయిలో వదిలేస్తే రెండుమూడు లీటర్ల నీరు వృథా అవుతోంది.
తాగునీటిని నిర్ణీత పరిమాణం వరకు తీసుకోవాలి. చాలామంది సగం గ్లాసు తాగి మిగిలిన నీరు పారబోస్తుంటారు.
కార్లు, బైకులు కడిగేందుకు చాలా మంది పైపులు ఉపయోగిస్తారు. దీంతో విద్యుత్, నీరు ఎంతో వృథా అవుతుంది. దీనికి బదులు బకెట్ నీటితో తడిగుడ్డ ఉపయోగించి వాహనాన్ని శుభ్రం చేసుకోవచ్చు.
ఇంట్లో వాటర్‌ప్యూరిఫైడ్ యంత్రాలు వాడేవారు చాలామంది ఇంటి నీటి ట్యాంకులకు అనుసంధానం చేసి వాడుతుంటారు. నీరు శుద్ధి కావడానికి రెండింతల నీరు వృథా అవుతుంది. అయితే ఈ నీటిని బకెట్‌లో పట్టుకుని దుస్తులు ఉతకడానికి, వంట పాత్రలు కడగటానికి వినియోగించొచ్చు.
ఒక పంట కాలానికి నీటి వినియోగం లెక్కలిలా..
ఉద్యానపంట ఎకరానికి నీరు
(మిల్లీలీటర్లలో)
నిమ్మ 900–1,200
అరటి 1,200–2,200
ఉల్లి 350–550
టమాట 400–800
చిక్కుడు 300–500
క్యాబేజీ 350–500

జలం.. మేల్కొంటేనే పదిలం

జలం.. మేల్కొంటేనే పదిలం