
‘పోరాటానికి సన్నద్ధం కండి’
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మెతక వైఖరిని నిరసిస్తూ కార్యాచరణను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఈ నెల 1 నుంచి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం ఆగదన్నారు. నీటి పారుదలశాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గూడ రాఘవరెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం నగరంలో జరగగా జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన ఐదు డీఏలు, పెండింగ్ బిల్లులు, కాంట్రిబ్యూషన్‌తో కూడిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, పీఆర్‌సీ అమలు చేయాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, ప్రదీప్, పౌలు కిషన్, ఒంటెల రవీందర్‌రెడ్డి, ఒంటెల ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛతలో వెలిచాల ఆదర్శం
రామడుగు: రామడుగు మండలం వెలిచాల గ్రామం స్వచ్ఛతలో ఆదర్శంగా నిలుస్తోందని స్వచ్ఛభారత్ కేంద్ర డిప్యూటీ కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. వెలిచాల గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలను బుధవారం కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించారు. పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, తడిపొడి చెత్త ప్రదర్శన, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, ఇంకుడు గుంతల నిర్వహణను పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు నితిన్ వర్మ, జైపాల్‌దక్ష్, డీఆర్‌డీవో శ్రీధర్, మండల ప్రత్యేకాధికారి అనిల్ ప్రకాశ్, ఎంపీడీవో రాజేశ్వరీ, ఎంపీవో శ్రావణ్‌కుమార్, యూనిసెఫ్ సమన్వకర్త కిషన్‌స్వామి, రమేశ్ పాల్గొన్నారు.
ఆర్టీసీ ఈడీగా బాధ్యతలు స్వీకరణ
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పగిడిమర్రి సోలోమన్ బుధవారం కరీంనగర్ బస్‌స్టేషన్ ఆవరణలోని ఈడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అయిన కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్‌ఎం బి.రాజు, డిప్యూటీ ఆర్‌ఎం(మెకానికల్) బీవీ.రావు, డిప్యూటీ ఆర్‌ఎం(ఆపరేషన్) ఎస్.భూపతిరెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ (కరీంనగర్ జోన్) విలాస్‌రెడ్డి, జోనల్ వర్క్స్ మేనేజర్ సుగుణాకర్, డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ స్వప్న కుమారి పాల్గొన్నారు.
హెచ్‌సీయూ భూములను కాపాడాలి
కరీంనగర్‌సిటీ: హెచ్‌సీయూ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పేర్కొంటూ బుధవారం ఏబీపీవీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీల భూములు కబ్జాకు గురవుతున్నాయని అన్నా రు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400ఎకరాలను ఆక్రమించి కార్పొరేటీకరణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంచర్లు వేసి సొమ్ము చేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే సెక్రటేరియట్ ముట్ట డిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యసమితి సభ్యులు కిరణ్మయి, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, యూనివర్సిటీ అధ్యక్షుడు బాలకృష్ణ, సాయి, అనూష, గౌరి, ప్రియ పాల్గొన్నారు.

‘పోరాటానికి సన్నద్ధం కండి’

‘పోరాటానికి సన్నద్ధం కండి’