
విద్యుత్ వైర్లు తగిలి రైతు దుర్మరణం
జగిత్యాలక్రైం: నువ్వు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు కిందపడిన విద్యుత్ వైర్లు కాలుకు తగిలి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవి చంద్రయ్య (55) గురువారం ఉదయం తన నువ్వు పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. ఉదయం వీచిన ఈదురుగాలులకు స్తంభానికి ఉన్న విద్యుత్ వైర్లు కింద పడ్డాయి. గమనించని చంద్రయ్య చేనులోకి వెళ్తుండగా వైర్లు కాలుకు తగలడంతో విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామంలో కరెంట్ లేదంటూ స్థానికుల ఫిర్యాదు మేరకు విద్యుత్ అధికారులు సమస్య ఎక్కడుందో తెలుసుకునేందుకు స్తంభాల వెంట వెదుకుతుండగా చంద్రయ్య శవమై కనిపించాడు. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రూరల్ ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చంద్రయ్య కుమారుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు.