
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కరీంనగర్‌రూరల్: ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి పసి ప్రాణం బలైంది. సదరు వ్యక్తి ట్రాక్టర్‌కు ఉన్న తాళం చెవిని తీయకపోవడంతో తెలియక స్టార్ట్ చేసిన చిన్నారి ట్రాక్టర్‌తో సహా బావిలో పడి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లెకు చెందిన గడ్డం రమ్య– అజీందర్‌రెడ్డికి ఇద్దరు కూతుర్లున్నారు. పెద్దకూతురు జశ్విత(3)ను మూడు రోజుల క్రితం తన అక్కబావలు అన్నాడి మంజుల– రాజిరెడ్డి ఊరైన కరీంనగర్ మండలం బహుదూర్‌ఖాన్‌పేటకు పంపించారు. బుధవారం చింతచెట్టు కొట్టేందుకు కూలీలు రావడంతో చెట్టుకింద ఉన్న ట్రాక్టర్‌ను రాజిరెడ్డి కుమారుడు అభిరామ్‌రెడ్డి చిన్నారి జశ్వితను సీటు పక్కనే కూర్చుండబెట్టుకుని వ్యవసాయబావి ముందు నిలిపి కిందకుదిగి వెళ్లిపోయాడు. ట్రాక్టర్‌పై ఉన్న జశ్విత తాళం చెవిని తిప్పడంతో స్టార్ట్ అయిన ట్రాక్టర్ వేగంగా ముందుకుపోయి బావిలో పడిపోయింది. స్ధానికులు క్రేన్‌సాయంతో ట్రాక్టర్‌ను బావిలో నుంచి బయటకు తీశారు. ట్రాక్టర్ కింద పడిన జశ్విత ఊపిరి ఆడక బావిలోనే మృతిచెందింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి వచ్చి మృతిచెందిన చిన్నారిని గుండెలకు హత్తుకుని రోధించిన తీరు చూసి స్థానికులు కంటతడిపెట్టారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి జశ్విత తండ్రి అజీందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు.
ట్రాక్టర్‌తో సహా బావిలో పడి చిన్నారి మృతి